కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా రిలీజులు ఇకపై చాలా కష్టమనే చర్చ సర్వత్రా జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే, కరోనా వైరస్ నుంచి ఎప్పుడు మనకి విముక్తి లభిస్తుందో తెలియడంలేదు. రోజురోజుకీ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఒకవేళ మన దేశంలో పరిస్థితి ఓ కొలిక్కి వచ్చినా, అమెరికా లాంటి దేశాల్లో కరోనా వైరస్ పెను ప్రభావం చూపుతోంది. దాంతో, సినిమా రిలీజులు అసాధ్యమనీ, ఈ నేపథ్యంలోనే సినిమాల్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై విడుదల చేసుకోవడం ఖాయమనీ ఓ ప్రచారం తెరపైకొచ్చింది. దీనిపై ఆయా సినిమాలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి. తాజాగా ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కూడా తన ‘రెడ్’ సినిమాపై స్పష్టతనిచ్చాడు.
కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే వుంటున్నానని చెబుతూ, తగిన సమయంలో సినిమా దియేటర్లలోనే విడుదలవుతుందని తేల్చి చెప్పాడు. దియేటర్లలో సినిమా రిలీజ్‌పై ఎలాంటి డైలమా లేని స్పష్టం చేసేశాడు. మిగతా సినిమాలదీ ఇదే బాట. అయినా, కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీశాక, వాటిని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద ఎలా ముందుగా విడుదల చేస్తారు? ఇంకో పదిహేను రోజులు.. ఆ తర్వాత అయినా పరిస్థితి ఓ కొలిక్కి వస్తుందని తెలుగు సినీ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒక్క టాలీవుడ్‌కే కాదు, మొత్తంగా ఇండియన్ సినిమాకీ.. ఆ మాటకొస్తే ప్రపంచ సినిమాకీ ఈ కరోనా వైరస్ పెద్ద తలనొప్పిగానే మారింది.