హీరోయిన్లకు వేధింపులు అనే అంశం ట్రెండింగ్‌గా మారింది. సినీ రంగంలో హీరోయిన్లకు ఎక్కడో ఓ చోట వేధింపులు తప్పనిసరి అని నిన్నటితరం అందాల భామ నగ్మాతోపాటు చాలామంది బ్యూటీస్ అభిప్రాయపడుతున్నారు. లేటెస్ట్‌గా టాలీవుడ్ బ్యూటీ రెజినా కూడా ఏడేళ్ళ క్రితం తాను అలాంటి వేధింపులనే ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఓ తమిళ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ ఎవరో ఫోన్ చేసి, అసభ్యకరంగా మాట్లాడారని తెలిపిందామె. అయితే అప్పట్లో స్పందించకుండా ఇప్పుడెందుకు ఇలా మాట్లాడింది? అని రెజినా గురించి సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇంకో వైపున హీరోయిన్లకు ఇలాంటి వేధింపులు మామూలేనని, ఓ మోస్తరు వేధింపుల్ని లెక్కచేయకుండా ఉండటమే మేలనీ, సందర్భం వచ్చింది గనుక ప్రతి ఒక్కరూ తమ గత అనుభవాల్ని షేర్ చేసుకుంటున్నారని కూడా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అది నిజం కూడా. హీరోయిన్లు కూడా సమాజంలో భాగమే. మహిళలు అన్ని రంగాల్లోనూ ఈ తరహా వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి సినీ రంగం ఇందుకు మినహాయింపు కాదు. సమాజం ఆలోచనల్లో మార్పు వస్తే తప్ప, ఈ వేధింపులు ఆగవు. చైతన్యం ఎంత పెరుగుతోందో అలాగే ఈ చెడు కూడా అలాగే పెరుగుతూ వస్తోందని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా వివిధ సినీ రంగాల ప్రముఖులు అంచనా వేయడం జరుగుతోంది.