తమిళ హీరో సూర్య నటించిన 'కాప్పాన్' త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే, విడుదల దగ్గర పడిన తరుణంలో ఈ సినిమాని ఆపాలంటూ అసిస్టెంట్ డైరెక్టర్ జాన్ కోర్టుకెక్కారు. గత పదేళ్లుగా ఈ కథపై ఆయన కసరత్తులు చేస్తున్నారనీ, ఒకానొక సందర్భంలో డైరెక్టర్ కేవీ ఆనంద్‌కి ఈ కథ చెప్పాననీ, ఆ కథ నచ్చి, భవిష్యత్తులో ఈ కథపై కలిసి పని చేద్దామని ఆయన తనకు హామీ ఇచ్చారనీ, కానీ, అదే కథతో తన ప్రమేయం లేకుండా 'కాప్పాన్' తెరకెక్కించారనీ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో కోర్టునాశ్రయించిన జాన్, ఎలాగైనా ఈ సినిమాని అడ్డుకుంటానని ప్రకటించారు. సూర్య, ఆర్య, సాయేషా సైగల్, మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'కాప్పాన్' సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. తాజా పరిణామాలతో రిలీజ్ విషయమై ఏమైనా గందరగోళం నెలకొంటుందా? ఏమో తెలియాల్సి ఉంది. ఇకపోతే, జాన్ కోర్టులో వేసిన కేసు సెప్టెంబర్ 4 వ తేదీన విచారణకు రానుంది.
ఈ కారణంగా ఆగస్ట్ 30న విడుదల కావల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 20కి వాయిదా పడింది. కోర్టు తీర్పు సూర్యకు అనుకూలంగా వస్తుందా.? లేదా.? వేచి చూడాలిక. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది.