తన పిల్లలిద్దర్నీ హైద్రాబాద్‌లో వుంచే క్రమంలో రేణు దేశాయ్‌కి పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌లో ఖరీదైన ఓ ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ గాసిప్స్ విన్పిస్తున్న విషయం విదితమే. పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ చాలాకాలం క్రిందట వివాహం చేసుకున్నారు. అంతకు ముందు కొన్నేళ్ళు ఇద్దరూ సహజీవనం చేశారు కూడా. అయితే, కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారిదే అయ్యింది. ఇదిలా వుంటే, గత కొంతకాలంగా ఇద్దరి మీదా చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే, రేణుకి పవన్ గిఫ్ట్‌గా ఫ్లాట్ ఇచ్చాడన్న పుకార్లు కూడా తెరపైకొచ్చాయి. ఈ పుకార్లపై స్పందించిన రేణు దేశాయ్, ఆ పుకార్లలో నిజం లేదని స్పష్టం చేసింది. ‘నా ఆస్తి నా ఆత్మగౌరవం.. ఆ ఫ్లాట్ నేనే స్వయంగా కొనుక్కున్నాను..’ అని చెప్పుకొచ్చింది. అయినా, ఒకవేళ వపన్ - తన పిల్లల కోసం ఓ ఫ్లాట్‌ని కొనుగోలు చేస్తే.. దాని చుట్టూ ఇంత పెద్ద కథ అల్లాల్సిన అవసరమేంటి.? అన్నది ఇంకో చర్చ. పవన్ - రేణు మధ్య ఏదో ఒక గాసిప్ సృష్టించి, ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తేలా చేయాలన్న కొందరి ఎత్తుగడలు ప్రతిసారీ బెడిసికొడుతున్నాయి.
రేణుదేశాయ్ దర్శకురాలిగా నిర్మాతగా ఒకటీ అరా సినిమాలు నిర్మించింది. బుల్లితెరపై ఓ డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరించింది. త్వరలో సినిమాల్లో మళ్ళీ నటించబోతోంది కూడా. పైగా, స్వతంత్ర భావాలు ఎక్కువగా వున్న డేరింగ్ అండ్ డాషింగ్ మహిళ ఆమె. ఆమెపై ఇలాంటి గాసిప్స్ రావడమంటే, అది పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత మాత్రమేనని పవన్ అభిమానులూ అంగీకరిస్తున్నారు.