చిరంజీవి తరవాత అసలైన మెగాస్టార్.... అల్లు అర్జునే.. అంటూ వర్మ ట్వీట్ చేయడం వల్ల - మరోసారి మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపినవాడయ్యాడు. ముందు నుంచీ మెగా ఫ్యామిలీ అంటే.. వర్మకు పడదు. ఏదో ఓ ట్వీట్ తో.. కామెంట్ తో.. కెలుకుతూ ఉంటాడు. ఇప్పుడూ అదే చేశాడు. ఓవైపు.. మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలకు బన్నీ ఎందుకు రాలేదంటూ.. అభిమానులు సెగ రేపుతోంటే, మరోవైపు వర్మ చేసిన ఈ ట్వీట్ ఆ అగ్నిలో ఆజ్యం పోసిన చందాన తయారైంది.
పవన్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక లాంటి వాళ్లని పరాన్న జీవులతో పోల్చాడు ఆర్జీవీ. వాళ్లంతా చిరుని నమ్ముకుని ఎదిగారని, అల్లు అర్జున్ మాత్రం స్వశక్తితో పైకొచ్చాడని వర్మ ట్వీట్ చేశాడు. దాంతో.. మెగా ఫ్యాన్స్ మధ్య మళ్లీ చిచ్చు రేపినట్టైంది. మెగాస్టార్ తరవాతి స్థానం ఎవరిది అంటే.. చాలామంది పవన్ పేరో, చరణ్ పేరో చెబుతారు. అయితే... తాజాగా వర్మ ట్వీట్ వల్ల.. ఆ స్థానం బన్నీకి వెళ్లాలా? అనే చర్చ మొదలైంది. చిరు వల్లే మెగా ఫ్యామిలీ హీరోలు బయటకు రాగలిగారన్నది వాస్తవం. అయితే.. ఆ తరవాత పవన్, చరణ్, వరుణ్, సాయిధరమ్ తేజ్ వీళ్లంతా తమ స్వశక్తితో ఎదిగిన వాళ్లే.
అల్లూ అర్జున్ కూడా అంతే. వెనుక.. అల్లు అరవింద్ ఉన్నాడు. చిరంజీవి ఉన్నాడు. అందుకే తనకు అవకాశాలొచ్చాయి. అయితే ఆ తరవాత.. తనదైన స్టైల్ చూపించాడు. అల్లు అర్జున్ సైతం..`మెగా వృక్షం కింద మేమంతా ఎదిగాం` అంటూ చాలాసార్లు చెప్పాడు. మెగాస్టార్ స్థానం ఎవరిది? అన్న విషయంలో ఎలాంటి క్వశ్చన్ లేదు. ఎందుకంటే మెగాస్టార్ మెగాస్టారే. ఆ తరవాతే మిగిలినవాళ్లంతా. కాకపోతే.. వర్మ ట్వీట్లు బన్నీ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. వాళ్లంతా తమ హీరోని మోసేస్తూ..వర్మ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. చూద్దాం.. ఈ ఊపు ఎంత కాలమో..?