'కడపా.. ఇది యమద్వారపు గడపా..' అంటూ సాగే 'కడప' టైటిల్ సాంగ్ విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ తెలుగు వెబ్ సిరీస్ ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో రాయలసీమ ఫ్యాక్షన్ చావుల్ని క్రూరాతి క్రూరంగా చూపించారు. అదే వీడియోని టైటిల్ సాంగ్ ప్రోమోలోనూ రిపీట్ చేశారు.
రాయలసీమ ఫ్యాక్షన్ గొడవల్ని, అత్యంత క్రూరమైన చావుల్ని గతంలో 'రక్త చరిత్ర' సినిమా ద్వారా వర్మ చూపించేశారు. అయితే ఇప్పుడు మరోసారి 'కడప' టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్ ద్వారా చూపించనున్నారు. ఈ టైటిల్ సాంగ్ ఫ్లేవర్ కూడా గతంలో 'రక్త చరిత్ర' టైటిల్ సాంగ్ ఫ్లేవర్‌నే తలపిస్తోంది. ప్రముఖ గీత రచయిత సిరాశ్రీ ఈ పాటను రచించారు. ట్రైలర్‌ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడిస్తూ వర్మ ఈ సిరీస్ ద్వారా నూటికి నూరు శాతం నిజాలనే చూపిస్తానని చెప్పారు.
ఈ సినిమా కోసం అంతా కొత్త వాళ్లనే నటీనటులుగా ఎంచుకున్నారు వర్మ. 'కడప' అనే టైటిల్‌లోనే రక్తచరిత్రని చూపించేశారు. టైటిల్ ఒత్తుల్లో గొడ్డలి, సుత్తి, వేట కొడవళ్లను ఉపయోగించారు. ట్రైలర్స్, ప్రోమోస్‌లోనే ఇంత రక్తపాతం చూపిస్తే, ఇక సిరీస్‌లో ఇంకెంత రక్తపాతం చూపించనున్నారో వర్మ. అయినా ఆన్‌స్క్రీన్ రక్తపాతం వర్మకి కొత్తేమీ కాదు. ఇదిలా ఉండగా మరో పక్క వర్మ నాగార్జునతో పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వర్మ తన సొంత బ్యానర్ 'కంపెనీ'లో నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. మరో పక్క వర్మ తెరకెక్కించబోయే మరో సెన్సేషనల్ మూవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమాని తెరక్కిస్తున్నారు వర్మ. లక్ష్మీపార్వతి యాంగిల్‌లో ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.