కమ్మ రాజ్యంలో.. అదేనండీ 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో, ఈ సినిమాని డిసెంబర్ 12న విడుదల చేసేందుకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా పోయాయి. తొలుత 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో ఈ సినిమాని వర్మ అనౌన్స్ చేసిన విషయం విదితమే. సరిగ్గా విడుదలకు ముందు తలెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ని మార్చాల్సి వచ్చింది. నిజానికి, అభ్యంతరాలు వ్యక్తమైతే ఏం టైటిల్ పెట్టాలో వర్మ ముందే డిసైడ్ అయినట్లుంది.
ఇక, సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ రావడం పట్ల వర్మ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. దేశంలో ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అలాగే వుందని తెలుసుకుని థ్రిల్లయ్యాను.. అంటూ వర్మ తనదైన స్టయిల్లో సెన్సార్ సర్టిఫికెట్‌పై స్పందించడం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిణామాలపై రామ్‌గోపాల్ వర్మ ఈ రాజకీయ సినిమాస్త్రం రూపొందించారు. వైఎస్ జగన్ పాత్రలో 'రంగం' ఫేం అజ్మల్ నటిస్తుండగా, కత్తి మహేష్, ధన్ రాజ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్.. తదితర పాత్రలు సినిమాలో వుంటాయి. అయితే, ఆయా పాత్రల తాలూకు పోలికలు కేవలం కల్పితమని వర్మ పైకి చెబుతుండడం కొసమెరుపు.