దర్శకుడు క్రిష్ 'ఎన్‌టిఆర్ బయోపిక్'ని రూపొందిస్తున్నారు. 'ఎన్‌టిఆర్ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్ మహానాయకుడు' పేర్లతో ఎన్‌టిఆర్ బయోపిక్ 2019 జనవరిలో 15 రోజుల తేడాలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెల్సిందే.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందిప్పుడు. అయితే, ఈ సినిమాపై అంచనాల సంగతెలా వున్నా.. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని తాజాగా ప్రకటించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. వాస్తవానికి ఆర్జీవీ ఎప్పుడో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టైటిల్‌ని అనౌన్స్ చేశాడు. ఓ లుక్ కూడా విడుదల చేయడం చూశాం. కానీ, కొన్ని కారణాలతో సినిమా ఆలస్యమయ్యింది. 2019 సంక్రాంతికి 'ఎన్‌టిఆర్ బయోపిక్' ఫస్ట్ పార్ట్ 'ఎన్‌టిఆర్ కథానాయకుడు' విడుదల కానుండడం, రెండో పార్ట్ 'ఎన్‌టిఆర్ మహానాయకుడు' రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేయడంతో, ఆర్జీవీ నుంచి వచ్చిన ప్రకటన ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది. క్రిష్ మంచి దర్శకుడు.
ఈ విషయం అందరికీ తెలుసు. ఆర్జీవీ సంచలనాల గురించి కొత్తగా చెప్పేదేముంది? ఏడాది కష్టపడి 'ఎన్‌టిఆర్ బయోపిక్'ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తే, ఆర్జీవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కోసం అంత పెద్ద మొత్తం బడ్జెట్ వెచ్చించాల్సిన అవసరం లేదు. నెల రోజుల్లో సినిమా పూర్తి చేసి, రిలీజ్ చేయగల సత్తా ఆర్జీవీకి వుంది. పైగా, ఆర్జీవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కోసం ఎంచుకున్న సబ్జెక్ట్ చాలా కాంప్లికేటెడ్. అలాంటివే ఆయన ఎంచుకుంటాడు మరి.
దాంతో, అందరికీ తెలిసిన చరిత్ర 'ఎన్‌టిఆర్ బయోపిక్' కంటే కూడా, అత్యంత వివాదాస్పదమైన 'వెన్నుపోటు' ఎపిసోడ్‌ని కేంద్రంగా చేసుకుని ఆర్జీవీ రూపొందించే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మీదకే ఎక్కువ ఫోకస్ వెళుతుంది. దర్శకుల్లో ఎవరెక్కువ, ఎవరు తక్కువ అని చెప్పలేం. సినిమాల పరంగా చూస్తే, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎక్కువగా ప్రేక్షకుల అటెన్షన్‌ని డ్రా చేసే అవకాశం ఉంటుంది.