ఎప్పుడు ఏం జరుగుతుందా.. ట్వీట్లతో జనం మీద పడిపోదామా అని చూస్తుంటాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు ఆయన ఫోకస్ కృష్ణంరాజు మరణంపై పడింది. కృష్ణంరాజు లాంటి నటుడు చనిపోతే.. కనీసం రెండు రోజులు కూడా షూటింగులు ఆపలేని దౌర్భాగ్య పరిస్థితి ఇండస్ట్రీలో ఉందంటూ, ఓ మహనీయుడి చావుని గౌరవించకపోతే.. రేప్పొదుట స్టార్స్ అందరికీ ఇదే గతి పడుతుందని వీర లెవిల్‌లో ట్వీట్లు వేశాడు ఆర్జీవి. అయితే ఈ ట్వీట్లని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. దానికి కారణం.. ఆర్జీవీ ట్వీట్లలోనే సీరియస్‌నెస్ లేదు.
కృష్ణంరాజుని ఇండస్ట్రీ సముచిత రీతిలోనే గౌరవించింది. ఆయన మరణిస్తే.. ఇండస్ట్రీ మొత్తం.. ఆయన భౌతికకాయం చూడ్డానికి బయల్దేరింది. సెలబ్రెటీలంతా.. కృష్ణంరాజుతో అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. ఓరకంగా.. కృష్ణంరాజుది ఘనమైన మరణమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆదివారం కొన్ని షూటింగులు జరిగాయి. వాటిని ఆపితే బాగుండేది.
మరోవైపు.. కృష్ణంరాజు చనిపోతే, ఆయన్ని చివరి సారి చూడ్డానికి కూడా రాంగోపాల్ వర్మ రాలేదు. అలాంట్పపుడు మిగిలినవారిని అనే హక్కు ఆయనకు ఎక్కడుంది..? అందుకే జనాలు కూడా ఈ ఆర్జీవీ ట్వీట్లని లైట్ తీసుకుంటున్నారు.