భారతీయ సినీ పరిశ్రమలో టెక్నాలజీని అత్యద్భుతంగా వాడుకునే అతి కొద్దిమంది దర్శకుల్లో తమిళ దర్శకుడు శంకర్ పేరు ముందుంటుంది. సినిమాకి సాంకేతికతను జోడించడంలో ఈయన దిట్ట. తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా శంకర్ చేసిన సినిమాలన్నీ సాంకేతిక అద్భుతాలే. ఒక్కోదాంట్లో ఒక్కోరకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రేక్షకుల మెప్పు పొందడం శంకర్ ప్రత్యేకత. అలా తన ప్రత్యేకతను చాటుకోవడానికి శంకర్ ఏం చేయడానికైనా వెనుకాడడు. శంకర్ మ్యాజిక్ నచ్చుతుంది గనుకనే నిర్మాతలూ ఆయన కోరినంత బడ్జెట్‌ని సమకూర్చుతుంటారు. 'రోబో' సినిమాకి సీక్వెల్‌గా రానున్న '2.0' సినిమా మేకింగ్ చూస్తే, ఇండియన్ సినిమా సమీప భవిష్యత్తులో వెయ్యి కోట్ల పైన ఖర్చు చేయగలిగే స్థాయికి చేరుతుందనుకోవడం అతిశయోక్తి అనిపించదు. ఓ సన్నివేశం కోసం రోడ్లను వేయించి, భవనాల్ని తలపించే సెట్టింగ్స్ వేయించడం శంకర్‌కి మాత్రమే సాధ్యం అనవచ్చు. కొన్ని సినిమాల్లో శంకర్ రోడ్లలపై చిత్ర విచిత్రమైన రంగులేయించడం చూశాం. బస్సులకి, రైళ్ళకి పూర్తిస్థాయిలో రంగులు అద్దేస్తుంటాడు. అదే అతని క్రియేటివిలో 'కలర్‌ఫుల్' కోణం. టెక్నికల్‌గా చూసుకుంటే 'రోబో' సినిమాకి సాటి ఇంకేముంటుంది? ఆ ఘనతను రిపీట్ చేయడానికి, అంతకన్నా పేరు సంపాదించడానికి '2.0' సినిమా చేపట్టాడు శంకర్. మేకింగ్ చూసినవారికి సినిమా చూసిన థ్రిల్ కలిగింది. అదీ శంకర్ అంటే. వన్ అండ్ ఓన్లీ టెక్నికల్ మాంత్రికుడని శంకర్‌ని అనేది అందుకే.