ఆర్.ఆర్.ఆర్... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా. విదేశాల్లో కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ నిలిచింది. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఆర్.ఆర్.ఆర్. ఎంపిక అవ్వలేదు. అయితే ప్రైవేటు ఎంట్రీగా... 14 విభాగాల్లో ఆస్కార్ కోసం పోటీ పడుతోంది ఆర్.ఆర్.ఆర్.
ఆస్కార్ బరిలో నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందుకోసం ఓ ప్రమోషనల్ ప్లాన్ కావాలి. దాని కోసం భారీగా ఖర్చు పెట్టాలి. ఆర్.ఆర్.ఆర్ బృందం అందుకు వెనుకంజ వేయడం లేదు. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం రూ.50కోట్లు ఖర్చు పెట్టాలని రాజమౌళి నిర్ణయం తీసుకొన్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.
14 విభాగాల్లో కనీసం ఒక విభాగంలో అయినా ఆస్కార్ పొందితే.. ఇండియన్ సినిమా రేంజ్ మారిపోతుంది. అంతే కాదు... రాజమౌళికి ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్.. ఇక నుంచి అంతర్జాతీయంగా మార్మోగుతుంది. అందుకే రూ.50 కోట్లు పెట్టడానికి రాజమౌళి ముందుకు వచ్చినట్టు సమాచారం. ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఒక్క విభాగంలో అయినా ఆస్కార్ రావాలి. వస్తే... రాజమౌళి కల నెరవేరినట్టే.