విశ్వ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఉండడంతో ఈరోజు ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కమల్ ని పరీక్షించిన వైద్యులు... ఆయనకు విశ్రాంతి అవసరమని తేల్చారు. కమల్ డిశ్చార్జ్ అయి.. ఇంటికి చేరుకొన్నారు. కమల్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, ఇటీవల కమల్ షూటింగులతో బిజీగా ఉండడం వల్ల అస్వస్థతకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.
కమల్ ఇండియన్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దాంతో పాటు బిగ్ బాస్ షో కూడా నిర్వహిస్తున్నారు. వరుస షూటింగులతో అలసిపోవడం వల్లే కమల్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. కొన్ని రోజులు కమల్ విశ్రాంతి తీసుకొంటే.. అన్నీ సెట్ అయిపోయే అవకాశాలున్నాయి.