దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా RRR. బాహుబలి తరవాత రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా అవ్వడం, ఎన్టీఆర్ - రామ్‌చరణ్ కలసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి లానే ఇది కూడా పాన్ ఇండియా ట్యాగ్ లైన్‌తో విడుదల కాబోతోంది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అయితే... ఇది స్వాతంత్య్ర సమరయోధుల కథ.
అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల పాత్రల్ని తీసుకుని, దానికి కల్పిత కథను అల్లి సినిమాగా తీస్తున్నారు. తెలుగు జాతికి సంబంధించిన వీరుల కథ ఇది. దాన్ని బాలీవుడ్ వాళ్లు చూస్తారా? అనేదే పెద్ద అనుమానం. తాజాగా ఓ తెలుగు వీరుడి కథని `సైరా`గా తీశారు. బాలీవుడ్‌లో ఈ సినిమాని అస్సలు పట్టించుకోలేదు. అమితాబ్ బచ్చన్ ని తీసుకొచ్చినా - హిందీ వాళ్లు కనికరించలేదు. బాలీవుడ్ లో సైరా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకి ప్రాంతీయ వీరుడి ట్యాగ్ అంటడమే అందుకు పెద్ద కారణం.
ఆ ప్రభావం `RRR పైనా పడే ప్రమాదం ఉందని రాజమౌళి అండ్ టీమ్ భావిస్తోంది. `ఇది తెలుగు వీరుల కథ` అని ప్రమోట్ చేయకుండా - స్వాతంత్ర సమరయోధుల సినిమాగానే ఈ సినిమాని ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. దాంతో.. ఆ ఎఫెక్ట్ కొంత వరకూ తగ్గుతుందని భావిస్తున్నారు. అయినా సరే.. ఈ సినిమాని బాలీవుడ్‌లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి తెలివితేటల్ని, మార్కెట్ స్ట్రాటజీని తక్కువ అంచనా వేయకూడదు. ఆయన తిమ్మిని బమ్మిగా మార్చగలడు. RRR విషయంలోనూ ఆయన మ్యాజిక్కులు వర్కవుట్ అవ్వొచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.