దసరా పండగ సీజన్‌ని `సైరా నరసింహారెడ్డి` బాగా క్యాష్ చేసుకుంటోంది. అక్టోబరు 2న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్‌తో పాటు దసరా సీజన్ కూడా కలసి రావడం వల్ల - వసూళ్లు నిలకడగా సాగుతున్నాయి. ఆరో రోజు (సోమవారం) సైతం సైరా నిలదొక్కుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపుగా 5.5 కోట్లు దక్కించుకుంది. మంగళవారం దసరా సెలవు. దాంతో.. ఈరోజు కూడా సైరా మరిన్ని వసూళ్లు పిండుకునే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే ఆరు రోజులకు గానూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 75.25 కోట్ల షేర్ తెచ్చుకుంది. నైజాంలో 21.60 కోట్లు వస్తే, సీడెడ్‌లో 13.3 కోట్లు రాబట్టింది. ఉత్తరాంధ్రలో 10.75 కోట్లు, గుంటూరులో 7.83 కోట్లు తెచ్చుకుంది. కృష్ణా, నెల్లూరు, ఈస్ట్, వెస్ట్‌లలో కూడా నిలకడైన వసూళ్లు రాబడుతోంది. ఉదయం ఆటలతో పోలిస్తే.. ఫస్ట్ షో, సెకండ్ షోలకు టికెట్లు ఎక్కువగా తెగుతున్నాయని థియేటర్ యజమానులు చెబుతున్నారు. సైరా దూకుడు ఈ వారాంతం వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. ఆ తరవాతే.. ఆర్థికంగా సైరా ఏ మేరకు విజయాన్ని సాధించిందన్న లెక్కలు తేలతాయి.