RRR ప్రమోషన్లు ఎక్కడా ఆగడం లేదు. మంచి స్వింగ్ లో ఉన్నాయి. డిసెంబరు 31 రాత్రి కూడా ఈ సినిమాదే హంగామా. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ... ఆర్.ఆర్.ఆర్ అభిమానులకు ఓ కానుక ఇవ్వబోతోంది. ఇటీవల ముంబైలో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ షో ఎక్కడా లైవ్ లో రాలేదు. కొన్ని ఫొటోలు బయటకు వచ్చినా, ఈ ఈవెంట్ లో ఏం జరిగిందన్నది ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఈ ఈవెంట్ మొత్తం టీవీలో చూసేయొచ్చు. ముంబైలో జరిగిన ఈవెంట్ ప్రసార హక్కుల్ని జీటీవీ సొంతం చేసుకుంది.
ఇప్పుడు డిసెంబరు 31 రాత్రి 11 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతోంది. దాదాపు రెండు గంటల పాటు సాగే షో ఇది. అంటే.. 2021 వెళ్లి.. 2022 వచ్చేంత వరకూ ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా సాగుతూనే ఉంటుందన్నమాట. ఆర్.ఆర్.ఆర్‌కి సంబంధించిన నాన్ థియేటరికల్ రైట్స్ మొత్తం జీ సంస్థ కైవసం చేసుకుంది. ముంబైలో జరిగిన ఈవెంట్ ని సైతం దాదాపుగా రూ.9 కోట్లకు కొనుగోలు చేసిందట. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డబ్బులు పెట్టి మరీ కొనుక్కోవడం ఇదే ప్రధమం. ఆర్.ఆర్.ఆర్.. రేంజు అలాంటిది మరి.