ఎన్నో వాయిదాల అనంతరం మార్చి 25న విడుదల కావడానికి ఆర్.ఆర్.ఆర్. ఫిక్సయ్యింది. ఈసారి ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఈ సినిమా రావడం ఖాయం. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. కాకపోతే... ఆర్.ఆర్.ఆర్.. బాక్సాఫీసు దగ్గర `లాభాల` బాట పట్టడం అనుకున్నంత ఈజీ కాదు.
ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు విడుదలైనా రికార్డు వసూళ్లు దక్కించుకోవడం ఖాయం. సినిమా ఏమాత్రం బాగున్నా ఆల్ టైమ్ రికార్డులన్నీ తనవే. కానీ.. బయ్యర్లకు లాభాలు తీసుకొస్తుందా, లేదా? అనేది పెద్ద అనుమానం. ఎందుకంటే ఈ సినిమా హక్కులన్నీ రికార్డు ధరకు అమ్మేశారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతో.. ఏపీలో పెట్టుబడి దక్కించుకోవడమే కష్టం. త్వరలో జీవో వస్తుందని, ఆ జీవోతో రేట్లు మారతాయని అనుకుంటున్నా... పెంచే రేట్లు `ఆర్.ఆర్.ఆర్` లాంటి పెద్ద సినిమాలకు ఏమాత్రం సరిపోవని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంత పెంచినా.. గతంలోలా టికెట్ రేట్లు ఉండబోవడం లేదు. 5వ ఆటకు అనుమతి ఇచ్చినా... అది కేవలం అదనపు షో మాత్రమే. బెనిఫిట్ షో లా దాన్ని చూడకూడదు. సో.. ఏపీలో ఫ్యాన్స్ షోలు లేనట్టే. ఆ రూపంలో అదనపు ఆదాయానికి గండి పడినట్టైంది.
పైగా మార్చి అనేది బ్యాడ్ సీజన్. విద్యార్థులకు అది పరీక్షల సమయం. ఆ సమయంలో సినిమాలు విడుదల చేయడం చాలా డేంజర్. మరోవైపు సరిగ్గా మార్చి చివరి వారంలోనే ఐపీఎల్ మొదలవుతుంది. ఆ ప్రభావం కచ్చితంగా వసూళ్లపై పడుతుంది. ఇలా ఎలా చూసినా.. ఆర్.ఆర్.ఆర్‌కి ఇది పరీక్షా సమయమే అవుతుంది. ఇవన్నీ దాటుకుని కూడా రికార్డులు సృష్టిస్తే... అది రాజమౌళి మాయే.