ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకి విలవిల్లాడుతున్న వేళ, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నుంచి టైటిల్ అనౌన్స్‌మెంట్, మోషన్ పోస్టర్.. అనగానే కొన్ని విమర్శలు వెల్లువెత్తిన మాట వాస్తవం. అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్, వర్క్ ఫ్రమ్ హోమ్.. సూత్రాన్ని అమలు చేసింది. ‘ఖచ్చితమైన సమయం చెప్పలేం.. ఎందుకంటే, మా టీమ్ చాలా కష్టపడ్తోంది.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది..’ అని దర్శకుడు రాజమౌళి ముందే హింట్ ఇచ్చేశాడు. అయితే, టైటిల్ మరియు మోషన్ పోస్టర్ విడుదలయ్యాక సీన్ మారిపోయింది. కరోనా అంశం కాస్త పక్కకు వెళ్ళి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించిన చర్చ తెరపైకొచ్చింది.
సోషల్ మీడియా అంతా ఈ సినిమా గురించిన హ్యాష్‌ట్యాగ్‌లే ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అలాగని, కరోనా భయం అస్సలేమాత్రం లేదని అనుకోవడానికి వీల్లేదు. ఆ భయం నుంచి కాస్త ఉపశమనం మాత్రమేనన్నమాట. ‘రౌద్రం రణం రుధిరం’ అంటూ తెలుగు వచ్చిన తెలుగు టైటిల్‌తోపాటు మిగతా టైటిల్స్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అన్నిటికీ మించి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇంకా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. కొమరం భీమ్ ఎన్టీఆర్, సీతారామరాజుచరణ్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్ దర్శనమిస్తున్నాయి సోషల్ మీడియాలో. అన్నట్టు, ఈ సందట్లో మెగాస్టార్ చిరంజీవి హ్యాష్‌ట్యాగ్ కూడా తన సత్తా చాటుకుంటోందండోయ్.