రాజమౌళి సినిమాలకు రికార్డులు కొల్లగొట్టడం కొత్తేం కాదు. తన సినిమా అంటే... బాక్సాఫీసు దగ్గర కొత్త చరిత్ర రాయాల్సిందే. బాహుబలితో తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత రాజమౌళిది. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్`తోనూ అదే ఫీట్ చేయబోతున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కథానాయకులుగా నటించిన ఈ చిత్రం అక్టోబరు 13న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకి సంబంధించిన బిజినెస్ డిటైల్స్ ఒకొక్కటిగా బయటకువస్తున్నాయి. అవన్నీ.. ట్రేడ్ వర్గాల్ని షాక్ లో ముంచెత్తుతున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్ సుమారుగా 400 కోట్లు. అయితే అందులో 350 కోట్లు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో వచ్చేసినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు నాన్ ధియేటరికల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, యూ ట్యూబ్ రైట్స్ రూపంలో మరో 550 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. అంటే... ఆర్.ఆర్.ఆర్ మొత్తం బిజినెస్ 900 కోట్లన్నమాట. ఆ లెక్కన ఆర్.ఆర్.ఆర్‌లో ఒక్కొక్క ఆర్... 300 కోట్ల విలువ చేస్తుందన్నమాట.
400 కోట్లతో సినిమా తీస్తే 500 కోట్లు లాభం రావడం నిజంగా సినీ చరిత్రలోనే ఓ అద్భుతం. ఒక్క హిందీ మార్కెట్ నుంచే దాదాపుగా 200 కోట్లు వచ్చినట్టు వార్తలొస్తున్నాయి. మరి ఈ సినిమా విడుదల అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.