ఆస్కార్ బరిలో ఆర్.ఆర్.ఆర్ పోటీ పడబోతోందని, ఈ సినిమాని ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ కు పంపిస్తారని ప్రచారం ముమ్మరంగా జరిగింది. తెలుగు సినిమా అభిమానులు నిన్నా మొన్నటి వరకూ ఈ ఊహాల్లోనే ఊరేగారు. అయితే ఈ ఆశలపై నీళ్లు చల్లింది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మన దేశం తరపున అఫీషియల్ ఎంట్రీగా గుజరాతీ సినిమా `ఛల్లో షో`ని ఎంపిక చేశారు.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నళిన్ పాన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మన దేశంలో ఇంకా విడుదల కాలేదు. కానీ పలు చిత్రోత్సవాలకు హాజరై.. అవార్డుల్ని గెలుచుకొంది. సినిమా అంటే పిచ్చి ఉన్న ఓ కుర్రాడి కథ ఇది. టికెట్ కొని, సినిమా చూసే ఆర్థిక స్థోమత లేక, ప్రొజెక్షన్ రూమ్‌లోంచే సినిమాలు చూస్తూ, సినిమాపై అవగాహన పెంచుకోవడం, ఆ తరవాత దర్శకుడిగా మారడం.. ఇదీ ఈ సినిమా కథ.
ఓ రకంగా ఈ చిత్ర దర్శకుడు నళిన్ ఆత్మ కథ అనుకోవొచ్చు. చాలా చిన్న పాయింట్‌తో అతి తక్కువ ఖర్చుతో, ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. ఉత్తమ విదేశీ చిత్రంలో మన సినిమా ఎంత గట్టి పోటీ ఇస్తుందో చూడాలి.