భారత చిత్రసీమ మొత్తం ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ వైపు చూస్తోంది. రాజమౌళి నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రమిది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటించిన ఈచిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. ఇంత పెద్ద సినిమా సంక్రాంతి లాంటి సీజన్‌లో రావడమే కరెక్ట్. కాకపోతే... ఏపీలో పరిస్థితులు ఈ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఏపీలో టికెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అదెప్పుడు వస్తుందో ఇంకా తెలీదు.
టికెట్ రేట్ల విషయంలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ కోర్టు కెళ్లే ఆలోచన చేస్తోందని ప్రచారం సాగింది. దీనిపై నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చారు. మేం.. జగన్ ని సంప్రదించి, మా కష్టాలు చెప్పుకుంటాం కానీ, కోర్టుకెక్కం.. అని స్పష్టం చేశారు. కానీ ఇక్కడో సమస్య ఉంది. టికెట్ రేట్ల పెంపు విషయంలో జగన్ సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు ఏం చేస్తారన్నది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడున్న రేట్లతో ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమా సర్దుకుపోవడం చాలా కష్టం. రేట్లు ఇలానే ఉంటే, ఈసినిమా విడుదల మరోసారి వాయిదా పడడం ఖాయం. కాబట్టి.. కచ్చితంగా రేట్లు సవరించాల్సిందే. లేదంటే.. కోర్టు మెట్లు ఎక్కడం మినహా... నిర్మాతల దగ్గర మరో ఆప్షన్ ఉండదు.
ముందు సీఎం ని సంప్రదించి, ఆయన కాదన్న పక్షంలో అప్పుడు కోర్టుకెళ్లాలన్నది నిర్మాత ప్లాన్. కానీ.. ఈ విషయం ముందే బయటకు పొక్కేసింది. దాంతో ఆర్.ఆర్.ఆర్ టీమ్ సర్దుబాటు చర్యలకు దిగి - `మేం కోర్టుకివెళ్లం` అని క్లారిటీ ఇవ్వాల్సివచ్చింది. రేపు జగన్ ని కలిసిన తరవాత, ఆయన `నో` అంటే అప్పుడు ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఏం చేస్తుందన్నది అంతు పట్టని వ్యవహారంగా మారింది. కోర్టుకి వెళ్తే.. సీఎంకి ఎదురు వెళ్లినట్టే. వెళ్లకపోతే... భారీ నష్టాల్ని చవి చూడాలి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అంటే ఇదే..!