నటీనటులు : బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక తదితరులు
దర్శకత్వం : కే ఎస్ రవి కుమార్
నిర్మాతలు : సి కళ్యాణ్
సంగీతం : చిరంతాన్ భట్
సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్
ఎడిటర్: డాన్ మాక్స్
రేటింగ్: 2.25/5
సినిమాలకు కొత్త కథలు అవసరం లేదన్నది కొందరి వాదన. స్టార్ హీరో దొరికితే... అస్సలు కథ గురించి ఆలోచించరు. వాళ్లకు సరిపడే యాక్షన్లు, ఫీట్లూ, రొమాన్సు వీటన్నింటినీ కలగిలిపి ఓ కథ వండేస్తారు. ఆ కథలో పాత సినిమా లక్షణాలన్నీ కనిపించినా ఫర్వాలేదనుకుంటారు. ఒక్క కొత్త సీను పడితే - ఎక్కడ ఆడియన్స్ హర్టయిపోతారో అన్నంత జాగ్రత్తగా కథలు అల్లుకుంటుంటారు. అలాంటి కథలకు, అలాంటి ఆలోచనలకు `రూలర్` ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది.
*కథ
అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ) ఓ కంపెనీకి సీఈవో. తన గతం ఏమిటో తనకు తెలీదు. సరోజినీ దేవి (జయసుధ) తనని చేరదీసి - వైద్యం చేయించి - మామూలు మనిషిగా మార్చి - తన కంపెనీ బాధ్యతల్ని అప్పగిస్తుంది. తనకు తల్లిగా మారిపోతుంది. అయితే ఆ అర్జున్ ప్రసాద్ ఓ ప్రాజెక్టు పనిమీద ఉత్తర ప్రదేశ్ వెళ్తాడు. అక్కడ అర్జున్ ప్రసాద్‌ని చూసి `ధర్మ..` అని పిలుస్తారంతా. చనిపోయాడనుకున్న ధర్మ - అర్జున్ ప్రసాద్‌లా తిరిగిరావడంతో అంతా ఆశ్చర్యపోతారు. అసలు ఆ అర్జున్ ప్రసాద్‌కీ, ధర్మకీ ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరూ వేర్వేరు వ్యక్తులా, ఒక్కటేనా? అనేది తెరపై చూడాలి.
*విశ్లేషణ
ముందే చెప్పినట్టు ఫక్తు కమర్షియల్ అంశాలతో అల్లుకున్న కథ ఇది. అందులో ఏమాత్రం కథలేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథకు మెరుగులూ దిద్దలేకపోయారు. కథనం కూడా మరీ రొటీన్‌గా సాగుతుంది. సీఈవో, పోలీస్... ఇలా రెండు పాత్రల్లో బాలయ్య కనిపించాడు. తొలి భాగం అంతా సీఈవో.. రెండో భాగం పోలీస్. గతం మర్చిపోయిన వ్యక్తికి రెండేళ్లు ఐటీ ట్రైనింగ్ ఇచ్చి - దేశంలోని అతి పెద్ద కంపెనీకి సీఈవోని చేయడం, కోమాలోంచి లేచిన హీరో, జయసుధని బతికించి మళ్లీ కోమాలోకి వెళ్లిపోవడం - ఇలాంటి సన్నివేశాలు మరీ రొటీన్‌గా, లాజిక్‌లకు దూరంగా అనిపిస్తాయి.
తెలుగు సినిమాల్లో లాజిక్కులు వెదక్కూడదు అనుకుంటే కథనంతోనైనా మ్యాజిక్ చేయాలి కదా. అది కూడా జరగలేదు. బ్యాంకాక్‌లో చేసిన కామెడీ... నవ్వు పుట్టించకపోగా - అసహనం కలిగిస్తుంది. దానికి తోడు డబుల్ మీనింగ్ డైలాగులు ఒకటి. ద్వితీయార్థంలో యాక్షన్ కి పెద్ద పీట వేశారు. కత్తులు, నరుక్కోవడాలూ ఎక్కవ కనిపిస్తాయి. పరువు హత్యల ఉదంతాన్ని చూపించారు. అలాంటి సన్నివేశాలు మనసుని హత్తుకునేలా, సమాజంలోని కుల గజ్జిని ఎత్తి చూపించేలా ఉండాలి. కానీ వాటిని కూడా యాక్షన్ సన్నివేశాలకు లీడ్‌గానే వాడుకున్నారు.
ద్వితీయార్థంలో ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్లూ ఏమాత్రం వర్కవుట్ అవ్వలేదు. అన్నీ పైపైన అల్లుకున్న సన్నివేశాలే. సప్తగిరి కామెడీ అయితే చిరాకు పుట్టిస్తుంది. 2020లో 1980 స్థాయి సినిమా తీశారేంటి అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే... ఆ రోజుల్లో ఇంతకంటే క్వాలిటీ సినిమాలొచ్చాయి. మొత్తంగా పాత కథల్లో కొన్ని సన్నివేశాల్ని ఎత్తేసి, వాటికి కమర్షియల్ రంగు పూసి, బాలయ్యతో రెండు గెటప్పులు వేయించి, మసి పూసి మారేడు కాయ చేయాలనుకున్నారు.
*నటీనటులు
బాలకృష్ణ తన పరిధిమేరకు చేశాడు. డైలాగులు చెప్పాడు. స్టెప్పులు వేశాడు. రెండు గెటప్పులో కనిపించాడు. కానీ ఈసినిమాని మాత్రం గట్టెక్కించలేకపోయాడంటే దానికి కారణం.. ఆ రెండు పాత్రలకూ తగిన కథ ఇందులో లేకపోవడమే. కథల ఎంపికలో బాలయ్య చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడు. తన తప్పుల్ని ఎప్పటికి దిద్దుకుంటాడో. హీరోయిన్లు ఇద్దరున్నా ఒక్కరికీ ప్రాముఖ్యం లేదు. వాళ్ల మొహాల్లో ఎక్స్‌ప్రెషన్స్ కూడా పలకలేదు. విలన్‌ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గానీ, లిప్ సింక్ కూడా కుదర్లేదు. ప్రకాష్‌రాజ్ కావల్సినదానికంటే ఓవర్ చేశాడు. భూమిక పాత్ర కూడా వేస్ట్ అయిపోయింది.
*సాంకేతికత
ఈ కథని ఎంచుకుని దర్శకుడు చాలా పెద్ద తప్పు చేశాడు. కథే ఇంత పేలవంగా ఉంటే, మరింత పేలవమైన సన్నివేశాలు అల్లుకుని కథనాన్ని భారం చేసేశాడు. మాటల్లో కొన్ని ఫేస్ బుక్ కొటేషన్లు దొర్లాయి. డబుల్ మీనింగులు వినిపించాయి. పాటల్లో ఒకట్రెండు బాగున్నాయంతే. త్వరగా పూర్తి చేయాలన్న తొందరలో నాణ్యత విషయంలో రాజీ పడ్డారు.
*ప్లస్ పాయింట్స్
బాలయ్య
*మైనస్ పాయింట్స్
మిగిలినవన్నీ
*ఫైనల్ వర్డిక్ట్: రొటీన్ రూలర్