'మేం ఆర్టిస్టులం.. మేం టెర్రరిస్టులం కాదు.. సినిమాల్లో రకరకాల పాత్రలుంటాయి. సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే. మా ఆర్‌ఎక్స్100 సినిమాలో హీరో ఆత్మహత్య చేసుకోడు.. ఆ సినిమా చూసి జగిత్యాలలో ఇద్దరు పిల్లలు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారం దురదృష్టకరం' అంటూ 'ఆర్‌ఎక్స్100' సినిమా హీరో కార్తికేయ, సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, సినిమాపై వస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేశాడు.
పిల్లల మనస్తత్వాన్ని గుర్తెరిగి, వారిని ఇంకాస్త జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఆత్మహత్యల్ని నివారించవచ్చునని చెప్పాడు కార్తికేయ. ఏ సినిమా కూడా, ప్రేక్షకుల్లో అలజడి సృష్టించాలని ఆ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులు అనుకోరని అన్నాడు ఈ యంగ్ హీరో. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన 'ఆర్‌ఎక్స్100' సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో ముద్దు సన్నివేశాల గురించి చాలా రచ్చ జరిగింది. అయితే, ఈ సినిమా చూసి ఇద్దరు విద్యార్థులు, ప్రేమించిన అమ్మాయి కోసం శరీరంపై పెట్రోల్ పోసుకుని చనిపోయారంటూ పోలీసులు కూడా ధృవీకరించడంతో హీరో కార్తికేయ పై విధంగా స్పందించాడు.
తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్‌ఎక్స్100' సినిమా మంచి విజయాన్ని సాధించడం పట్ల ఆనందంగా వున్నామనీ, ఈ సమయంలో ఇలాంటి ప్రచారం బాధ కలిగిస్తోందనీ, ఇద్దరు చిన్నారుల మృతి తనను కలచివేసిందని కార్తికేయ వివరించాడు. దీనికి సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేస్తూ, అందులో తన ఆవేనను వ్యక్తబరిచాడు ఈ యంగ్ హీరో.