కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా తెరకెక్కిన చిత్రం 'ఆర్‌ఎక్స్ 100'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'అర్జున్‌రెడ్డి' సినిమా తర్వాత అలాంటి సినిమా వచ్చిందంటూ ఈ సినిమాని పొగిడేస్తున్నారు. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యిందీ సినిమా. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
హీరో రగ్గ్‌డ్ లుక్, హీరోయిన్ అంతకు మించిన గ్లామర్ లుక్ యూత్‌ని కట్టిప డేస్తున్నాయి. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాల గురించి చిత్రం విడుదలకు ముందే పబ్లిసిటీ బాగా చేశారు. అలాగే స్టోరీ కూడా రొటీన్‌కి భిన్నంగా ఉండడంతో అన్ని వర్గాల్నీ అనలేం కానీ, కొన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా ఎట్రాక్ట్ చేసింది. దాంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే రాబడుతోందీ సినిమా. వర్మ శిష్యుడు కదా. కొన్ని షాట్స్‌లో ఆయన చేతి వాటం చూపించాడు డైరెక్టర్. కానీ పూర్తిగా తనదైన ముద్ర వేసేందుకు చేసిన ప్రయత్నం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఈ మధ్య సినిమాలు యూత్‌కి కనెక్ట్ అయితే చాలు, పిచ్చ పిచ్చగా వసూళ్లు రాబడుతున్నాయి. సెన్సేషన్ కూడా అయిపోతున్నాయి. అలా సెన్సేషన్ అవుతున్న సినిమాల్లో 'ఆర్‌ఎక్స్ 100'ని కూడా ఈజీగా చేర్చేయొచ్చనిపిస్తోంది. హీరో క్యారెక్టర్‌కి తగ్గట్లుగా కార్తికేయ చక్కటి నటన కనబరిచాడు. సీనియర్ హీరో రాంకీ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు.
అన్నట్లు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రశంసలు కూడా అందుకుందీ సినిమా. 'ఆర్‌ఎక్స్ 100' టీమ్ చరణ్‌ని కలిసింది. సినిమా చూడాలని చరణ్‌ని కోరింది.