నటీనటులు : కిరణ్ ఆబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్ తదితరులు
దర్శకత్వం : శ్రీధర్ గాడె
నిర్మాతలు : ప్రమోద్ - రాజు
సంగీతం : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : విశ్వాస్ డేనియల్
ఎడిటర్: శ్రీధర్ గాడె
రేటింగ్: 2.5/5
ఈమధ్య చిన్న సినిమాల్లో గట్టిగా వినిపించిన పేరు... `ఎస్.ఆర్.కల్యాణమండపం`. రాజావారు - రాణీగారు సినిమాతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరపు హీరో కావడం, ఈ సినిమా ప్రచార చిత్రాలు, పాటలు.. నచ్చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. పైగా ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా, నిర్మాతలు చలించలేదు. థియేటర్లోనే విడుదల చేస్తామని పట్టుపట్టారు. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు.. విడుదలైంది. మరి కల్యాణ మండపంలోని విశేషాలేంటి? దాని కథేంటి? జాతకం ఎలా ఉంది? తెలుసుకుంటే..
* కథ
కడపలోని రాయచోటి లో ఈ కథ మొదలవుతుంది. అక్కడ కిరణ్ (కిరణ్ అబ్బవరపు) ఓ అల్లరి కుర్రాడు. స్నేహితులతో సరదాగా తిరడం, మందు కొట్టడం, అమ్మాయిల్ని ఏడిపించడం - ఇదీ తన హాబీలు. నాన్న ధర్మ (సాయికుమార్)కి ఓ కల్యాణమండపం ఉంది. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే. అయితే.. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా బాగా చితికిపోతారు. కిరణ్‌కి బాధ్యత తెలిసొచ్చి, ఆ కల్యాణమండపాన్ని ఎలా నిలబెట్టాడు? తన కుటుంబాన్నిఆర్థిక నష్టాల నుంచి ఎలా కాపాడుకున్నాడు? అనేదే కథ.
* విశ్లేషణ
ఎస్.ఆర్.కల్యాణమండపం అంటూ ఓ వెరైటీ టైటిల్ పెట్టుకుంది చిత్రబృందం. టైటిల్ కి తగ్గట్టుగానే.. కల్యాణమండమే ఈ సినిమా కథకు కోర్ పాయింట్. దాంట్లో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని - వాళ్ల దూరాన్ని మిక్స్ చేసి, దానికో ప్రేమ కథ జోడించాడు దర్శకుడు. కథ పరంగా.. ఓకే. అద్భుతంగా ఏం లేకపోయినా రెండు గంటలు పాటు నడిపించడానికి తగిన సరంజామా ఈ కథలో ఉంది.
తొలి సగం.. హాయిగా సాగిపోతుంది. హీరో, తన స్నేహితులతో వేసే వేషాలు, కాలేజీ అల్లర్లు.. పాటలు.. తండ్రీతో చిలిపి తగాదాలూ ఇలా ఫస్టాఫ్ లో వంక పెట్టడానికి ఏం లేదు. టైమ్ పాస్ అయిపోతుంది. అయితే ద్వితీయార్థంలోనే అసలైన తలనొప్పి మొదలవుతుంది. కల్యాణమండపాన్ని అభివృద్ధిలోకి తీసుకుని రావడం, తాను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సెకండాఫ్‌లో హీరో లక్ష్యాలు. ఈ రెండు పాయింట్లనీ.. దర్శకుడు జనరంజకంగా తీయలేకపోయాడు. తండ్రీ - కొడుకుల మధ్య సన్నివేశాలు ఫస్టాఫ్ లో పండినంతగా, రెండో భాగంలో పండలేదు. హీరోయిన్ పెళ్లి చెడగొట్టి, తనని తనదానిగా చేసుకోవడం కోసం హీరో వేసే ప్లానులు, పడిన పాట్లు అంతగా రక్తి కట్టలేదు.
కల్యాణ మండపం అనేది కోర్ పాయింట్. అయితే.. దర్శకుడు ఎక్కడా కల్యాణమండపాన్ని సరిగా చూపించలేకపోయాడు. ఆ మండపం ఓ కీలక పాత్ర అయినప్పుడు... దాన్ని వాడుకోవాల్సింది. కొన్ని కథలు.. ప్రారంభించిన విధానం బాగుంటుంది. ముగింపు సరిగా ఉండదు. ఈ సినిమా సమస్య కూడా అదే. ఫస్టాఫ్ లో కనిపించిన ఫ్లో. ఆ ఎమోషన్ పూర్తిగా సెకండాఫ్ లో కనిపించకుండా పోతుంది. దాంతో.. తొలి సగంలోని ఇంప్రెషన్ మొత్తం మాయం అవుతుంది. చాలా సన్నివేశాలు సాధారణంగానే ఉంటాయి. కానీ హీరో తన మేనరిజంతో వాటిని నెట్టుకొస్తాడు. కొన్ని చోట్ల.. ఆయా సన్నివేశాల్ని సంభాషణలు నిలబెట్టాయి.
* నటీనటులు
కిరణ్ కి ఇది రెండో సినిమా. పైగా ఈ సినిమాకి తనే కథ అందించాడు. నటుడిగా మరోసారి మెప్పించాడు కిరణ్. తన ఎక్స్‌ప్రెషన్స్, మేనరిజం అన్నీ బాగున్నాయి. మంచి కథలు ఎంచుకుంటే - మరింతగా రాణిస్తాడు, నటుడిగా తన నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేనట్టే. అయితే ఈ సినిమాకి కథ కూడా తానే. కథలో ఎమోషన్ ఉంది. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.
ఈమధ్య విడుదలైన తిమ్మరుసులో హీరోయిన్ గా చేసిన ప్రియాంక జవాల్కర్ ఇందులోనూ కథానాయిక పాత్ర పోషించింది. తిమ్మరుసు లో బాగా బొద్దుగా కనిపించిన ఈ నాయిక.. ఈసారి మాత్రం ఓకే అనిపిస్తుంది. తన పాత్రకున్న ప్రాధాన్యం అంతంత మాత్రమే. ఇక సాయికుమార్ మరోసారి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. చాలా సహజంగా ఆ పాత్రలో అల్లుకుపోయాడు. చాలా సన్నివేశాలు తన నటన వల్లే నిలబడ్డాయి. తొలిసగం పాసైపోవడానికి సాయి కుమార్ నటనే కారణం. హీరో స్నేహితులుగా నటించినవాళ్లకూ మంచి మార్కులు పడతాయి.
* సాంకేతిక వర్గం
పాటలన్నీ ముందే హిట్. చుక్కల చున్నీవే అయితే యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ పాటలన్నీ థియేటర్లోనూ బాగున్నాయి. కలర్‌ఫుల్ గా తెరకెక్కించాడు దర్శకుడు. కొన్ని చోట్ల సంభాషణలు బాగున్నాయి. మేకింగ్ పరంగానూ ఓకే అనిపిస్తుంది. ఎటొచ్చీ... ద్వితీయార్థం దగ్గరే సమస్యే. అక్కడ కథ, కథానాలు మరింత బాగా రాసుకుని ఉండుంటే.. మంచి ఫలితం దక్కేది.
* ప్లస్ పాయింట్స్
కిరణ్ - సాయికుమార్‌ల నటన
ఫస్టాఫ్
పాటలు
* మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం
* ఫైనల్ వర్డిక్ట్: టైమ్ పాస్ మూవీ