థియేటరికల్ రిలీజ్ కోసం ఎదురు చూసీ, చూసీ చివరికి ఓటీటీకి వెళ్లిపోయింది టక్ జగదీష్. అమేజాన్ ప్రైమ్.. ఈ సినిమాని భారీ రేటుకి కొనుగోలు చేసింది. అన్నీ కలుపుకుని టక్ జగదీష్‌కి రూ.50 కోట్ల వరకూ బేరం కుదిరింది. ఈ లెక్కన ఇది మంచి డీలే. అందుకే.. టక్ జగదీష్ తో పాటు సిద్ధమైన మీడియం రేంజు సినిమాలు సైతం - ఇప్పుడు ఓటీటీ బాట పట్టడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
టక్ జగదీష్ తో పాటుగా - లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విరాటపర్వం సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలూ ఒకే సీజన్ లో రావాల్సివుంది. రిలీజ్ డేట్లు ప్రకటించుకున్నాక.. ఆగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా మెల్లగా ఓటీటీ బాట పట్టడానికి రెడీగా ఉన్నాయని టాక్. విరాటపర్వంకి ముందు నుంచీ మంచి ఓటీటీ ఆఫర్లు ఉన్నాయి. పైగా సురేష్ బాబు ఇప్పుడు ఓటీటీ వైపే మొగ్గు చూపిస్తున్ననారు. నారప్ప సినిమాని ఓటీటీకి అమ్ముకుని ఆయన లాభపడ్డారు. ఇప్పుడు విరాటపర్వం సైతం.. ఓటీటీకే వెళ్లిపోతుందని టాక్. ఇక.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` పరిస్థితీ ఇలానే ఉంది. ఈ సినిమాపై ఎవ్వరికీ అంచనాలు లేవు. పైగా.. చాలాకాలం సెట్స్‌పై ఉండడంతో ఈ సినిమాపై హైప్ అంతకంతకూ తగ్గుతూ వచ్చింది. ఓటీటీకి అమ్ముకోవడం మినహా ఈ సినిమాకి మరో మార్గం లేదని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన లవ్ స్టోరీ కూడా ఓటీటీ బాట పడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మూడు సినిమాలూ ఓటీటీతో బేరాలు జరుపుతున్నాయి. డీల్ కుదిరితే... ముహూర్తాలు ఖాయం అయిపోయినట్టే.