సినిమా విడుదల ఒక్కసారి పోస్ట్‌పోన్ అయ్యిందంటే, ఆ స్లాట్ బుక్ చేసుకోవడం ఎంత కష్టమైన పనో ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో చూస్తున్నాం. అయితే, 'సాహో'కి మాత్రం అలా జరగలేదు. ఆగస్ట్ 15న విడుదల కావల్సిన 'సాహో' ఆగస్ట్ 30 కి పోస్ట్‌పోన్ అయ్యింది. కానీ, ఎలాంటి ఆటంకి లేకుండానే విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న 'సాహో'కి నిజంగా 'సాహో' అని తీరాల్సిందే.
ఈ సినిమాని తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఒకేసారి ఈ నాలుగు భాషల్లో విడుదలవుతోన్న 'సాహో' కోసం, దేశ వ్యాప్తంగా అదే రోజు విడుదల కానున్న నాలుగు సినిమాల నిర్మాతలు తమ తమ సినిమాల రిలీజ్‌లను వాయిదా వేసుకొని, 'సాహో'కి సైడ్ ఇచ్చేయడంతో, నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మనసు చాటుకుని, తమ సినిమాపై ఇంతటి అభిమానం చూపించినందుకు, ఆయా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు 'సాహో' నిర్మాతలు.
ఈ అరుదైన నిర్ణయానికి ప్రబాస్ కూడా సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. 'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు ప్రబాస్. సో ప్రబాస్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకొచ్చిందిలే అనుకుని, 'సాహో'కి సైడ్ ఇచ్చేశారు. దాంతో నాలుగు భాషల్లో 'సాహో' విడుదలకు ఎలాంటి అడ్డంకీ లేదిక. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే, సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు 'సాహో' టీమ్.
యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సాహో'లో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.