'సాహో' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
దర్శకత్వం: సుజీత్
నిర్మాణం:  యువి క్రీయేషన్స్ 
సంగీతం: గిబ్రాన్ 
సినిమాటోగ్రఫర్: మధీ 
విడుదల తేదీ: ఆగస్టు 30,  2019
 

రేటింగ్‌: 2.5/5

 
బాహుబ‌లి త‌ర‌వాత సినీ అభిమానులు అంత‌గా ఎదురుచూసిన సినిమా `సాహో`. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్క‌డం, అంత‌ర్జాతీయ నిపుణులు ఈ సినిమా కోసం ప‌నిచేయ‌డం, బాలీవుడ్ స్టార్స్ మెర‌వ‌డంతో సాహోపై అంచ‌నాలు బాగా పెరిగాయి. బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఫోక‌స్ మ‌రింత ఎక్కువైంది.


దానికి తోడు ప్ర‌చారం కూడా చాలా ఉధృతంగా చేశారు.  సాహోపై పాన్ ఇండియా ముద్ర కూడా ప‌డిపోయింది. ఇన్ని ఆశ‌లు, అంచ‌నాల మధ్య విడుద‌లైన సాహో ఎలా ఉంది?  బాహుబ‌లితో ఎవ‌రెస్టు ఎక్కిన ప్ర‌భాస్ ఇమేజ్‌కి - సాహో ఏ విధంగా ప్ల‌స్ అవ్వ‌నుంది..?


* క‌థ‌

 
వాజీ సిటీలో జ‌రిగే క‌థ ఇది.  పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) మాఫియా సామ్రాజ్యానికి వార‌సుడిగా దేవరాజ్‌ (చుంకీ పాండే)ని చూడాల‌నుకుంటాడు. పృథ్వీరాజ్‌ చేరదీసిన రాయ్‌ (జాకీ ష్రాఫ్) మ‌రో గ్రూపు నడుపుతుంటాడు. దాంతో రాయ్ - ఫృథ్వీ రాజ్ మ‌ధ్య దూరం పెరుగుతుంది. స‌డ‌న్‌గా ఓ రోజు ముంబైలో  రాయ్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో 2 లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది. రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు.


మునిగిపోయిన షిప్‌లో ఉన్న 2 లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు. మరోవైపు ముంబయిలో 2 వేల‌ కోట్ల దొంగతనం జరుగుతుంది. ఈ కేసుని అండర్‌ కవర్‌ కాప్‌ అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) కి అప్ప‌గిస్తారు.  అమృత (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతకీ రాయ్‌ని ఎవరు చంపారు, విశ్వక్‌ రూ. రెండు లక్షల కోట్లు సంపాదించాడా, అశోక్‌ చక్రవర్తి - మీరా నాయర్‌ ప్రేమ ఏమైంది? అనేదే సాహో క‌థ‌
 

* న‌టీన‌టులు


యాక్ష‌న్ సీన్ల‌లో త‌న‌కు ఎదురులేద‌ని ప్ర‌భాస్ మ‌రోసారి నిరూపించాడు. శ్ర‌ద్దాతో రొమాంటిక్ సీన్ల‌లోనూ బాగానే న‌టించాడు. కానీ ప్ర‌భాస్ ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోలా క‌నిపించాడు. ప్ర‌ధాన పాత్ర విష‌యంలో కంటిన్యుటీ లేక‌పోవ‌డం ఏమిటో అర్థం కాదు. చాలాసార్లు అందంగా క‌నిపించిన ప్ర‌భాస్‌, కొన్ని షాట్ల‌లో మాత్రం ఆ గ్లామ‌ర్ త‌గ్గిందేటి?  అనిపిస్తాడు.


శ్ర‌ద్దాక‌పూర్ అందంగా ఉంది. యాక్ష‌న్ సీన్ల‌లో బాగా చేసింది. న‌టిగా త‌న‌కు ప‌డే మార్కులు చాలా త‌క్కువ‌. చుంకీ పాండే న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. జాకీష్రాఫ్ బాగానే చేశాడు. అయితే మిగిలిన‌వాళ్లెవరికీ త‌మ స్థాయికి త‌గ్గ పాత్ర‌లు ద‌క్క‌లేదు. ముర‌ళీశ‌ర్మ‌లాంటివాళ్ల‌తో స‌హా.
 

* సాంకేతిక వ‌ర్గం


350 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ గ‌ట్టిగా చెబుతోంది. అంత ఖ‌ర్చు పెడితే క్వాలిటీ లేకుండా ఎలా ఉంటుంది. విజువ‌ల్‌గా  ఈసినిమాని చాలా గ్రాండ్‌గా రిచ్‌గా తీర్చిదిద్దారు. మ‌ది కెమెరా ప‌నిత‌నం అడుగుడుగునా క‌నిపిస్తుంది. మ‌రీ ముఖ్యంగా యాక్ష‌న్ దృశ్యాల్లో. పాట‌లు నిరాశ ప‌రిచాయి. నేప‌థ్య సంగీతం హాలీవుడ్ స్థాయిలో ఉంది.

 

యాక్ష‌న్ సీన్లు కూడా ఆక‌ట్టుకుంటాయి. అయితే... ప్ర‌భాస్ ఇమేజ్‌కీ, బాహుబ‌లి త‌ర‌వాత పెరిగిన క్రేజ్‌కి ఈ క‌థ అస్స‌లు మ్యాచ్ కాలేదు. స్క్రీన్ ప్లే బ‌లం అని న‌మ్మి తీసిన ఈ సినిమాలో అదే పెద్ద మైన‌స్‌గా మారింది. మ‌లుపుల్ని ముందే ఊహించ‌డంతో క‌థ‌లో కిక్‌పోయింది. డ‌బ్బులు నీళ్ల‌లా ఖ‌ర్చు పెట్టినా - క‌థ‌లో బ‌లం, పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌, బ‌ల‌మైన పాత్ర‌లు,  క‌థ‌ని న‌డిపించే స‌న్నివేశాలు లేక‌పోవ‌డంతో సాహో అడుగ‌డుగునా నిరాశ ప‌రుస్తుంది.


* విశ్లేష‌ణ‌


ప్ర‌చార చిత్రాలు చూస్తున్న‌ప్పుడే ఇదో మాఫియా నేప‌థ్యంలో సాగే గ్యాంగ్ స్ట‌ర్‌ల క‌థ అనేది అర్థ‌మ‌వుతూనే ఉంది. గ్యాంగ్ స్ట‌ర్‌ల లైఫ్‌, వాళ్ల మ‌ధ్య‌లో ఉండే ఆధిప‌త్య‌పోరు.. ఖ‌రీదైన దొంగ‌త‌నాలు... కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులూ - ఇలా యాక్ష‌న్ సినిమాకి కావ‌ల్సిన అన్ని హంగులూ ఉన్న సినిమా ఇది. హాలీవుడ్‌లో యాక్ష‌న్ సినిమాల్ని త‌ర‌చూ చూసేవాళ్ల‌కు ఈ క‌థ‌, అది సాగే క్ర‌మం అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. ప్రారంభ స‌న్నివేశాలు, రాబ‌రీ, ఛేజింగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే స‌న్నివేశాలు ఇవన్నీ ప్రేక్ష‌కుల్ని ఓ మూడ్‌లోకి తీసుకెళ్తుంటాయి.

 

మ‌ధ్య‌మ‌ధ్య‌లో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని ఏమాత్రం నిరుత్సాహ‌ప‌ర‌చ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఇరికించిన ప్రేమ స‌న్నివేశాలు, రొమాన్స్ ఇబ్బంది పెడుతున్నా - ప్ర‌భాస్‌ని  అలాంటి స‌న్నివేశాల్లో చూడ‌డం ప్రేక్ష‌కుల‌కు ఇష్టం కాబ‌ట్టి, వాటినీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. కొన్ని స్టైలీష్ యాక్ష‌న్ సీన్లు, పాట‌లు, రిచ్ విజువ‌ల్స్‌, ఓ ట్విస్టుతో ఇంట్ర‌వెల్ అయ్యింద‌నిపించుకున్నారు. ఆ ట్విస్టు.. థియేట‌ర్లో ప్రేక్ష‌కుడు అడుగుపెట్ట‌క‌ముందే ఊహించింది కాబ‌ట్టి - ట్విస్టు కూడా సోసోగానే అనిపిస్తుంది.

 

ద్వితీయార్థంలో మ‌రిన్ని ట్విస్టులు ఉంటాయ‌ని, క‌నీసం అప్పుడైనా స్క్రీన్ ప్లే గ‌మ్మ‌త్తులు ఉంటాయ‌ని ప్రేక్ష‌కుడు ఆశించ‌డంలో త‌ప్పులేదు. ఈ సినిమా గురించి ప‌దే ప‌దే చెప్పింది అదే. ద్వితీయార్థంలో ట్విస్టులు ఉన్నాయి. కానీ అవ‌న్నీ క‌థ‌ని మ‌రింత గంద‌ర‌గోళంలో ప‌డేస్తుంటాయి. యాక్ష‌న్ సీన్ల జోరు ఎక్కువ‌గానే ఉన్నా, అవి ఇది వ‌ర‌కు చూసిన ఫైట్స్‌లానే అనిపించ‌డంలో అవి కూడా రుచించ‌కుండా పోయాయి. సినిమా సాగుతున్న కొద్దీ.. అస‌లు ఈ క‌థ‌ని ప్ర‌భాస్ ఎలా ఒప్పుకున్నాడా అనే అనుమాన‌మూ వేస్తుంటుంది. హాలీవుడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్లు ఎక్కువ‌గా చూస్తున్న ఈ కాలంలో.. ఆ సినిమాల్లో ఉండే ట్విస్టుల్ని ముందుగానే ఊహిస్తున్నారు.

 

కొన్ని ముందే లీకైపోతున్నాయి. అలా.. సుజిత్ ఈ సినిమాలో కావ‌ల్సిన‌న్ని ట్విస్టులు పెట్టుకున్నా - అవ‌న్నీ ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కు అతీతంగా మాత్రం లేవు. పాట‌లు స్పీడ్ బ్రేక‌ర్లుగా మారిపోయాయి. అవి మ‌రీ స్లోగా ఉండడం, కొన్ని పాట‌ల్లో సాహిత్యం అర్థం కాకుండా పోవ‌డంతో క‌థ‌నంపై మ‌రింత ప్ర‌భావం చూపించింది. కోట్లు ఖ‌ర్చు పెట్టిన తీసిన ఛేజింగులు, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఒక్క‌టే ఊర‌ట క‌లిగిస్తాయి. అది కూడా మాస్ జ‌నాల‌కే. క‌థ‌లో విల‌న్లు చాలామంది ఉన్నా - బల‌మైన విల‌న్ ఒక్క‌డూ క‌నిపించ‌క‌పోవ‌డం విచిత్రంగా తోస్తుంది. తెలుగు సినిమానే చూస్తున్నా, కొన్ని సార్లు డ‌బ్బింగ్ బొమ్మ‌లా అనిపించ‌డం కూడా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది.


* ప్ల‌స్ పాయింట్స్‌ 

ప్ర‌భాస్‌
యాక్ష‌న్ సీన్లు
రిచ్ టేకింగ్‌

 

* మైన‌స్ పాయింట్స్

క‌థ‌
పాట‌లు
గంద‌ర‌గోళం

 
* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  సారీ సాహో

 

- రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS