నల్లమల్లలో యురేనియం తవ్వకాలపై గొంతు విప్పిన కథానాయకుల్లో విజయ్ దేవరకొండ ఒకడు. యురేనియం తవ్వకాల్ని ఆపాలని, నల్లమల్లని కాపాడుకోవాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చాడు. ఆ తరవాత.. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, సామాజిక వేత్తలు ఈ విషయంపై గళం ఎత్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా `యురేనియం తవ్వకాలపై అనుమతులు ఇచ్చేది లేద`ని స్పష్టం చేసింది. కేటీఆర్ కూడా ఈ విషయమై ట్వీట్ చేశారు.
నల్లమల్లపై తెలంగాణ ప్రభుత్వ విధివిధానాల్ని ఆయన స్పష్టం చేశారు. నల్లమల్లని కాపాడతామని, యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతి లేదని ట్వీట్ చేశారు. దీనిపై విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. కేటీఆర్ ట్వీట్ తన మొహంలో నవ్వునీ, నమ్మకాన్నీ తీసుకొచ్చిందని, ప్రభుత్వం తమ వెంట నడిచిందని ఆనందంగా, ఉద్వేగంగా ట్వీట్ చేశారు. ఇలాంటి నాయకుల్ని గౌరవిస్తానని, ప్రేమిస్తానని ట్వీటాడు. `నీపై ప్రేమ, గౌరవం పెరిగాయి కేటిఆర్ అన్నా` అంటూ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.