మెగా మేనల్లుడు తేజు కొత్త చిత్రం వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'ఇంటెలిజెంట్' అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. వినాయక్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అలాగే మెగా ప్యామిలీలో సాయి ధరమ్‌తేజ్ అంటే తనకెంతో ఇష్టమని వినాయక్ గతంలో అన్నారు. ఇప్పటికే చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్‌తో సినిమాలు తెరకెక్కించిన వినాయక్ తాజాగా మెగా ఫ్యామిలీ నుండి తేజుతో సినిమా చేస్తున్నారు.
ఇక వినాయక్ లిస్టులో మిగిలి ఉన్నది మెగా ఫ్యామిలీ హీరోస్లో పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ మాత్రమే. వీరితోనే వినాయక్ ఇంతవరకూ సినిమాలు చేయలేదు. త్వరలోనే చేసే అవకాశాలు కూడా లేకపోలేవు. ఇకపోతే, తాజా సినిమా విషయానికి వస్తే, 'ఇంటెలిజెంట్' ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. వినాయక్ మార్కు ఎంటర్టైన్మెంట్తో పాటు, చిరంజీవి రిఫరెన్సులు ఈ సినిమాలో చాలా ఉండబోతున్నాయట. తేజు స్టైలింగ్, యాక్టింగ్ స్కిల్స్ అంతా యంగ్ ఏజ్‌లో చిరంజీని తలపించనున్నాయనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
ఈ సినిమా కోసం తేజు బాడీ లాంగ్వేజ్ అంతా చాలా మారిపోయిందట. ఇక పాటల విషయానికి వస్తే, ఆల్రెడీ గతంలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాల్లో మామయ్య చిరంజీవి సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ సినిమా కోసం చిరంజీవి సినిమాలోంచి, 'చమక్ చమక్ చం..' పాటను రీమిక్స్ చేయనున్నాడట. సాంగ్స్ విషయంలోనే కాదు, చిరంజీవిని గుర్తుకు తెచ్చే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయట. ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో తేజుతో జత కడుతోంది. సి. కళ్యాణ్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఫిబ్రవరిలో 'ఇంటెలిజెంట్' ప్రేక్షకుల ముందుకు రానుంది.