ఏప్రిల్ 7వ తేదీన వరుణ్ తేజ హీరోగా నటించిన 'మిస్టర్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. వరుణ్ సరసన ఈ సినిమాలో హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకుడు. అయితే ఈ సినిమాని ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. మళ్ళీ దాన్ని ఏప్రిల్ 13వ తేదీకి మార్చారు. తిరిగి ఇప్పుడు ఏప్రిల్ 14న విడుదల కన్ఫామ్ అని దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా కన్ఫామ్ చేశాడు. ఒక్క రోజు విషయంలో ఇంత గందరగోళానికి 'మిస్టర్' టీమ్ ఎందుకు గురవుతోందో అర్థం కావడంలేదు. ఒక్క రోజు మాత్రమే డిఫరెన్స్ గనుక ఇది పట్టించుకోవాల్సినంత పెద్ద విషయం కూడా కాదు. ఇంకో వైపున సినిమాలో కొత్త క్యారెక్టర్లను పరిచయం చేస్తూ లేటెస్ట్ పోస్టర్ని దర్శకుడు శ్రీనువైట్ల విడుదల చేశాడు సోషల్ మీడియా ద్వారా. ఇందులో వోడ్కా ప్రసాద్ పాత్రలో రఘుబాబు, సత్యాగ్రహి పాత్రలో షకలక శంకర్, చక్కారావు పాత్రలో షేకింగ్ శేషు కన్పిస్తారు. హీరో పాత్ర పేరు 'చై' అని ఇప్పటికే పరిచయం చేయగా, పూర్తి పేరుని పిచ్చయ్య నాయుడిగా లేటెస్ట్గా పరిచయం చేయడం గమనించదగ్గది. 'బ్రూస్లీ' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని శ్రీనువైట్ల చేస్తున్న సినిమా ఇది. ఇంకో వైపున 'లోఫర్' తర్వాత వరుణ్ తేజ నటిస్తున్న సినిమా ఇది. అలా ఈ ఇద్దరికీ ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించాల్సి ఉంటుంది.