విరూపాక్ష, బ్రో సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి 'సంబరాల ఏటి గట్టు' అనే పేరు పరిశీలనలో ఉంది. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఓ భారీ సెట్ వేశారు. అక్కడే సింహభాగం చిత్రీకరణ జరుగుతుంది.
ఈ చిత్రానికి 300 అనే హాలీవుడ్ సినిమాకూ ఓ సంబంధం ఉందని ఇన్ సైడ్ వర్గాల టాక్. 300 లో కేవలం మూడొందల మంది యోధులు ఓ బలమైన సైన్యాన్ని ఎదుర్కొంటారు. ఆ పోరాటం స్ఫూర్తివంతంగా సాగుతుంది. సంబరాల ఏటి గట్టు కూడా అలాంటి కథే అని తెలుస్తోంది. స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన కథ ఇది. బ్రిటీష్ సైనికుల్ని ఓ ఊరిలోని యోధులు ఎలా ఎదిరించారో, వాళ్లపై ఎలా పోరాడారో ఈ సినిమాలో చూపిస్తున్నార్ట. 300 స్ఫూర్తితోనే దర్శకుడు ఈ కథ రాసుకొన్నట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ అనే ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉందని, బడ్జెట్ లో సింహభాగం వాటికే ఖర్చు పెడుతున్నారని సమాచారం.