మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లోని పాటల్ని రీమిక్స్ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ. ఏదో అలా రీమేక్ చేసేసి, సినిమాకి పబ్లిసిటీ పెంచుకోవడమొక్కటే లక్ష్యంగా పెట్టుకోలేదు ఈ యంగ్ హీరో. ఆ సాంగ్స్ తాలూకు 'క్లాసిక్ టచ్' ఏమాత్రం తగ్గకుండా, ఆ పాటల పరువు పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటిదాకా చేసిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ కోవలోనే 'చమకు చమకు..' పాట కూడా సూపర్ హిట్ అవుతుందని తేజూ ధీమా వ్యక్తం చేశాడు.
నిజానికి రీమిక్స్ చేయాలన్న ఆలోచన, సినిమా అనుకున్నప్పుడు ఉండదనీ, అనుకోకుండా దర్శకులు ఆ సాంగ్స్‌ని రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తుంటారనీ, అలా మెగా రీమిక్స్‌లు తాను చేస్తున్నానని చెప్పాడు తేజు. ఓ దశలో రీమిక్స్ మానేద్దామనుకున్నా, సినిమా కోసం సందర్భాలు కుదురుతుండడంతో వాటిని వదులుకోలేకపోతున్నానని తేజు ఓ సందర్బంలో అసలు విషయం బయటపెట్టాడు. తన తాజా చిత్రం 'ఇంటెలిజెంట్' కోసం తేజూ, చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా 'కొండవీటి దొంగ' నుంచి 'చమకు చమకు..' పాటని రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది.
ఆడియో సింగిల్‌ని రిలీజ్ చేశారుగానీ, ఎక్కడా ఓ డాన్స్ స్టెప్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్తున్నారట. అంత స్పెషల్ ఆ సాంగ్‌లో ఏముందో తెలియాలంటే సినిమా చూడాల్సిందేనట. 'కొంచెం కొత్తగా ట్రై చేశా - మెగాస్టార్‌ని మించిపోలేను, జస్ట్ టచ్ చేసేందుకు ప్రయత్నం మాత్రమే జరిగింది. ఆశీర్వదించాల్సింది అభిమానులే' అంటూ తేజు, రీమిక్స్ గురించి చెప్పాడు. అసలే దర్శకుడు వినాయక్, చిరంజీవికి వీరాభిమాని. దానికి తోడు స్టైలింగ్‌లో మెగాస్టార్‌ని అచ్చంగా దించేసే మేనల్లుడు. వెరసి సాంగ్ మెగా రేంజ్‌లోనే వచ్చిందనుకోవచ్చు.