సాయిధరమ్ తేజ్ - సంపత్‌నంది కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన 'గాంజా శంకర్' అర్థాంతరంగా ఆగిపోయింది. తేజ్ రూ.15 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడని, అందుకే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఈ సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయ్. ముఖ్యంగా 'గుంటూరు కారం' ఎఫెక్ట్ గాంజా శంకర్‌పై గట్టిగా పడిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. 'గుంటూరు కారం' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. 'గాంజా శంకర్' సినిమానీ అదే సంస్థ టేకప్ చేసింది. ఈ సినిమాని రూ.30 నుంచి రూ.40 కోట్లలో తీయాలన్నది ప్లాన్.
అయితే బడ్జెట్ అంతకంతకూ పెరిగి, పెరిగి.. చివరికి రూ.70 కోట్లకు తేలిందని టాక్. 'గుంటూరు కారం' హిట్టయి, చేతినిండా డబ్బులు ఉంటే.. 'గాంజా శంకర్'పై పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి అభ్యంతరాలూ ఉండేవి కావు. కానీ ఫలితం రివర్స్ అయ్యేసరికి చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సినిమాని సితార హోల్డ్‌లో ఉంచింది.
అయితే ఇప్పటికే సాయిధరమ్ తేజ్ కి సితార అడ్వాన్స్ ఇచ్చేసింది. ఈ సంస్థలో తేజ్ ఓ సినిమా చేయాలి. 'గాంజా శంకర్' స్థానంలో తేజ్‌తో ఓ సినిమా చేయాలని, సితార భావిస్తోంది. అందుకే ఇప్పుడు తేజ్ కోసం కథలు ప్రిపేర్ చేస్తోంది. `విరూపాక్ష` హిట్ అవ్వడంతో తేజ్‌పై రూ.30 నుంచి రూ.40 కోట్లు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. డిజిటల్, శాటిలైట్, ఓటీటీ మార్కెట్ డల్ గా ఉన్న ఇలాంటి వాతావరణంలో అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం రిస్కే. అందుకే మినిమం బడ్జెట్ లో పూర్తయ్యే కథ కోసం సితార గట్టిగా అన్వేషిస్తోంది.