వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే హీరో.. సాయిధరమ్‌తేజ్. తొలిసారి ఓ వర్గానికి ఆగ్రహం తెప్పించే పని చేశాడు. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయి కూర్చుంది. వివరాల్లోకి వెళ్తే... హీరో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా `బ్రో` ఈనెలలోనే విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తేజ్ ఆధ్యాత్మిక పర్యటనలు మొదలెట్టాడు. అందులో భాగంగా శుక్రవారం కాళహస్తి ఆలయాన్ని దర్శించుకొన్నాడు. బ్రో సినిమా హిట్ అవ్వాలని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. అంత వరకూ బాగానే ఉంది.
అయితే.. స్వామి వారికి తేజ్ స్వయంగా హారతి ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. సంప్రదాయం ప్రకారం స్వామి వారికి అర్చకులే హారతి ఇవ్వాలి. కానీ ఆ నిబంధనని తేజ్ అతిక్రమించాడు. దాంతో భక్తులు తేజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేజ్ ఆచారాలు పాటించాలని, అది తెలియకపోతే అడిగి తెలుసుకోవాలని, తేజ్ హారతి ఇస్తుంటే చుట్టు పక్కల వాళ్లు ఏం చేస్తున్నారని కొంతమంది భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై తేజ్ గానీ, ఆయన సన్నిహితులు గానీ ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.