మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుండడంతో ఇకపై ఆచి తూచి అడుగులు వేయాలని అనుకుంటున్నాడట. భారీ అంచనాలతో తెరకెక్కిన రెండు చిత్రాలూ 'జవాన్', 'ఇంటెలిజెంట్' తేజుని బాగా నిరాశపరిచాయి. 'సుప్రీమ్' లాంటి హిట్ ఒకటి కావాలి అర్జెంట్‌గా తేజుకిప్పుడు. కానీ ఎలా? ప్రస్తుతం కరుణాకరన్‌తో ఓ లవ్‌స్టోరీలో నటిస్తున్నాడు తేజు. అనుపమా పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సంగతిటుంచితే, తేజు ఇప్పుడు తన ఆలోచనలు మార్చుకున్నాడనీ తెలియవస్తోంది. సక్సెస్, ఫెయిల్యూర్స్ సంగతి పక్కన పెడితే, మాస్ హీరోగా తానేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాడు తేజు.
లవ్ స్టోరీతో ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే ప్రయోగాల సంగతేంటని అడిగితే, నెక్ట్స్ తాను చేయబోయేది ప్రయోగమేనట అని తేజు నుండి వస్తున్న సమాధానం అని ఆ నోటా ఈ నోటా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తేజు చేయబోయే ప్రయోగానికి శ్రీకారం చుట్టే ఆ డైరెక్టర్ ఎవరా అంటే, విభిన్న చిత్రాల డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి పేరు వినిపిస్తోంది. తొలి సినిమా 'ఐతే'తో చంద్రశేఖర్ ఏలేటి డైరెక్టర్‌గా తనలోని డిఫరెంట్ టాలెంట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, 'ఐతే' అవార్డు విన్నింగ్ మూవీగా టాలీవుడ్లో ప్రత్యేక స్థానంలో నిలిచింది.
అందుకే ఇప్పుడు మెగా మేనల్లుడి దృష్టిలో పడ్డాడట ఈ డైరెక్టర్. 'అనుకోకుండా ఒకరోజు', 'సాహసం', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం', 'మనమంతా' ఇలా చంద్రశేఖర్ ఏలేటి నుండి వచ్చిన సినిమాలన్నీ ప్రయోగాత్మక విభిన్న కథా చిత్రాలే. ఈయన ఇప్పుడు తేజుతో తెరకెక్కించబోయే ఆ విభిన్న కధా చిత్రమేంటో కానీ, ఈ చిత్రంలో ఈసారి తన మేనమామలను అనుకరించకూడదని తేజు గట్టిగా డిసైడ్ అయ్యాడనీ తెలుస్తోంది.