పోలీస్ స్టోరీ... డైలాగ్ కింగ్ సాయికుమార్ ని యాక్షన్ కింగ్ గా మార్చిన సినిమా ఇది. పోలీస్ కథల ఒరవడిని పూర్తిగా మార్చి ఓ ట్రెండ్ అయిపోయింది. ఆ తరవాత సాయి కుమార్ చాలాసార్లు పోలీస్ పాత్రలు చేసినా. అంత కిక్ రాలేదు. పోలీస్ స్టోరీ 2 అంటూ ఓ సినిమా తీశారు. అది కూడా ఫట్టే. ఇప్పుడు పోలీస్ స్టోరీకి మరో సీక్వెల్ రాబోతోంది. అదే.. `నాలుగో సింహం`. వచ్చే యేడాదికి `పోలీస్ స్టోరీ` విడుదలై పాతికేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా పోలీస్ స్టోరీకి కొత్త సీక్వెల్ ప్రకటించబోతున్నారు.
ఈ చిత్రానికి `నాలుగో సింహం` అనే పేరు ఖరారు చేశారు. ఇందులో సాయికుమార్‌తో పాటు ఆది కూడా నటించబోతున్నాడు. థ్రిల్లర్ మంజు ఈ చిత్రానికి దర్శకుడు. సాయికుమార్‌కి కన్నడలో మంచి క్రేజ్ ఉంది. ఆదిని కూడా కన్నడ సీమకు పరిచయం చేయాలని సాయి కుమార్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ సినిమాతో అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సీక్వెల్‌కి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.