ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. అంటూ ఉత్సాహాన్ని నింపి, చైతన్యాన్ని పంచిన గొంతు మూగబోయింది. తన పాటతో... జనాన్ని జాగృతి చేసిన ఆ గజ్జె ల సవ్వడి ఇప్పుడు శాశ్వతంగా ఆగిపోయింది. ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు(77) ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. ఉత్తరాంధ్ర మాండలికంలో ప్రజా గీతాల్ని రాసి, ఆలపించడంలో వంగపండు ప్రసిద్ధి. ఆర్.నారాయణమూర్తి సినిమా అంటే వంగపండు పాట తప్పకుండా ఉండేది. మూడు దశాబ్దాల కాలంలో దాదాపుగా 300 పాటల్ని రచించారు వంగపండు. పలు ప్రాంతాలు తిరిగి, తన పాటలు వినిపించి చైతన్యం నింపారు. 1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు 2017లో కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు.