ప్రతీరోజూ పండగే తో ఓ సూపర్ హిట్ కొట్టాడు సాయిధరమ్ తేజ్. ఆ ఉత్సాహంతోనే `సోలో బ్రతుకే సో బెటరు` సినిమానీ మొదలెట్టేశాడు. ఈసినిమాకి మంచి హైప్, క్రేజ్ ఉంది. విడుదలకు ముందే.. మంచి బిజినెస్ రేంజ్ ఏర్పడింది. ఓటీటీ బేరాలూ వచ్చాయి. అయితే.. ఇవన్నీ లాక్ డౌన్ వల్ల.. తేలిపోతున్నాయి. ఈ సినిమాని కనీసం ఓటీటీలో అయినా విడుదల చేయాలన్నది నిర్మాతల ప్లాన్. ఇప్పటికే జీ 5 ఈ సినిమాకి క్రేజీ ఆఫర్ ఇచ్చిందట. రూ.30 కోట్లకు ఈ సినిమా కొనడానికి ముందుకొచ్చిందని టాక్. 30 కోట్లకు సినిమాని అమ్మేస్తే... నిర్మాతలకు భారీ ఎత్తున టేబుల్ ప్రాఫిట్ దక్కుతుంది.
అయితే ఇక్కడే ఓ చిక్కు ఉంది. ఈసినిమా షూటింగ్ మరో 10 రోజులు బాకీ ఉంది. అది పూర్తయితే గానీ.. ఓటీటీ సంస్థకు అమ్మడానికి వీల్లేదు. ఆ పది రోజులు షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా షూటింగులు చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. కరోనాకి ఓ పరిష్కారం దొరికితే తప్ప ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవ్వదు. కరోనాకి వాక్సిన్ వచ్చి, భయాలు పోయిన తరవాతే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. అప్పటి వరకూ 30 కోట్ల బేరం అలానే ఉంటుందా? అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడంటే థియేటర్లు లేవు, ఓటీటీ తప్ప మరో మార్గం లేదు కాబట్టి.. ఓటీటీ సంస్థలు భారీ రేట్లకు సినిమాలు కొంటున్నాయి. అయితే ఇంత డిమాండ్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. షూటింగులు మొదలయ్యాక తప్పకుండా థియేటర్లు తెరచుకుంటాయి. అప్పుడు ఇంత మొత్తం ఇవ్వడానికి ఓటీటీ రెడీగా లేకపోవొచ్చు. సినిమా పలితంలో తేడా వస్తే.. మొదటికే మోసం వస్తుంది. అంటే.. ఇప్పుడు తేజూ నిర్మాతల ముందున్న ఆప్షన్ ఒక్కటే. ఈ లాక్ డౌన్ సమయంలోనూ రిస్క్ చేసి షూటింగ్ పూర్తి చేయడం. మరి అందుకు తేజూ ఏమంటాడో?