మెగా హీరోగానే కాదు, మనసులోనూ మెగా మనసున్నోడే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. సేవా కార్యక్రమాల్లో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. ఫోటోల కోసమో, పబ్లిసిటీల కోసమో చేసేవి కాదు మెగా ఫ్యామిలీ సేవలు. చాలా వరకూ పరోక్షంగానే ఉంటాయి. ఎప్పటివో ఎప్పుడో వెలుగులోకి వస్తూంటాయి. అలాంటిదే మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజు చేసిన సేవా కార్యక్రమం ఒకటి వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం జిల్లాలోని ఓ మారుమూల గిరిజన ప్రాంతం అభివృద్దికై ఏర్పాటైన సేవా సంస్థకు సాయి ధరమ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. 'థింక్ పీస్' అనే ఈ సేవా సంస్థ గిరిజన గ్రామాల్లో విద్య, వైద్య, ఆరోగ్య తదితర అంశాలపై కనీస సదుపాయాలను పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటైంది. ఈ సేవా సంస్థకు సాయి ధరమ్ తేజ్ పరోక్షంగా తన వంతు సాయం అందిస్తూనే ఉన్నాడు. మీకు గుర్తుందో లేదో, గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంకి తేజు విచ్చేసినప్పుడు తాను ఆ గేమ్‌లో గెలచుకున్న మొత్తాన్నీ ఈ సంస్థకే విరాళంగా ఇచ్చేశాడట. అదీ మనోడి మంచితనం. పబ్లిసిటీకి దూరంగా ఉండే ఈ తరహా సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడట మనోడు. అఫ్‌కోర్స్ మెగా ఫ్యామిలీ అంటే అంతే కదా. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ కూడా ఇంతే కదా. అలాగే తేజు కూడా. ఇది సరే, త్వరలోనే తేజు 'జవాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెహరీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.