చిత్రం: సైంధవ్
నటీనటులు: విక్టరీ వెంకటేష్, రుహనీ శర్మ, శ్రద్దా శ్రీనాథ్, బేబీ సారా, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిఖీ
దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సంగీతం: సంతోష్ నారాయణ్
ఛాయాగ్రహణం: ఎస్.మణికందన్
కూర్పు: గ్యారీ BH
బ్యానర్స్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 13 జనవరి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
ఓతరం ప్రేక్షకుల్ని అలరించిన కథానాయకుడు వెంకటేష్. ఇప్పటికీ.. అదే జోష్‌లో ఉన్నారు. తన వయసుకి, ఇమేజ్‌కి తగిన పాత్రలతో, కథలతో అలరిస్తున్నారు. వెంకీ ఎప్పుడూ ఒకే జోనర్‌కి స్ట్రక్ అయిపోలేదు. అన్ని రకాల కథలూ, క్యారెక్టర్లూ టచ్ చేశారు. అలాంటి వెంకీ ఇప్పుడు 75 చిత్రాల మైలు రాయిని అందుకొన్నారు. 'సైంధవ్'తో. 'హిట్', 'హిట్ 2' చిత్రాలతో వరుస విజయాల్ని అందుకొన్న శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. వెంకీ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ కావడం, శైలేష్ కొలను లాంటి నవతరం దర్శకుడు ఈ సినిమాని హ్యాండిల్ చేయడంతో 'సైంధవ్'పై అందరి దృష్టి పడింది. అన్నింటికంటే ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా వచ్చింది. మరి... `సైంధవ్` సంక్రాంతి వినోదాన్ని పంచాడా? తన 75 వ సినిమా ఏ స్థాయిలో ఉంది? ఆ వివరాల్లోకి వెళ్తే...
కథ: సైంధవ్ (వెంకటేష్)కి తన కూతురు గాయత్రి (సారా) అంటే చాలా ఇష్టం. తల్లిలేని పిల్ల కాబట్టి ఇంకా గారాబం. అలాంటి గాయత్రికి నరాలకు సంబంధించి ఓ వ్యాధి ఉంటుంది. అందుకోసం ఓ ఇంజక్షన్ చేయాలి. దాని ఖరీదు రూ.17 కోట్లు. ఓ సాధారణ మధ్యతరగతి తండ్రి అంత ఖరీదైన ఇంజక్షన్ కొనగలిగాడా? తన కూతుర్ని రక్షించుకొన్నాడా? అనేదే కథ. ఈ ఇంజక్షన్ కథ ఓ వైపు సాగుతుంటే.. మరోవైపు డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణకు సంబంధించిన కథ నడుస్తుంటుంది. ఈ రెండు కథల్నీ దర్శకుడు ఎలా ముడిపెట్టాడు? అసలింతకీ సైంధవ్ గతం ఏమిటి? `సైకో` అని అతన్ని ఓ ముఠా ఎందుకు పిలుస్తోంది? ఇవన్నీ ఈ కథలో ఆసక్తికరమైన అంశాలు.
విశ్లేషణ: ఇదో యాక్షన్ డ్రామా. అందులో వెంకీ స్టైల్ కి తగిన ఎమోషన్ జోడించారు. ఓ తండ్రి తన బిడ్డని కాపాడుకోవడానికి ఏం చేశాడు? అనేది ఎప్పుడూ కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ఎలిమెంటే. కానీ దాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దలేకపోయారు. ఈ సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువైంది. ఎస్.ఎమ్.ఏ (స్పైనల్ మక్సులర్ అట్రోఫీ) అనే అరుదైన జబ్బుకి సంబంధించిన కథ ఇది. అత్యంత ఖరీదైన చికిత్స అవసరం. ఆ ఇంజక్షన్ ఖరీదు రూ.17 కోట్లు. ఈ విషయాలు, వివరాలూ సగటు ప్రేక్షకుడికి ఓ పట్టాన అర్థం కాదు. మరీ రూ.17 కోట్లా? అని అంతా ఆశ్చర్యపోతారు కానీ, నిజానికి ఇంత ఖరీదైన ఇంజక్షన్ ఉంది కూడా. అయితే ఇది అరుదైన జబ్బు అని చెప్పి, ఈ జబ్బే ఒకే ప్రాంతంలో దాదాపు 350 మంది చిన్న పిల్లలకు ఉందని చెప్పడం మరీ అసహజంగా ఉంటుంది. చిన్న పిల్లల్ని ఉగ్రవాదంలోకి దింపడం అనే మరో ట్రాక్ సమాంతరంగా నడుస్తుంటుంది. ఎందుకో అది పెద్దగా రిజిస్టర్ అవ్వదు.
తొలి సగంలో చాలా విషయాల్ని దాచేశాడు దర్శకుడు. సైంధవ్ గతం ఏమిటి? పక్కింట్లో ఉంటున్న మను (శ్రద్దా త్రినాథ్) ఎవరు? ఆమెకూ శైలేష్‌కీ ఉన్న అనుబంధం ఏమిటి? ఆర్య క్యారెక్టర్ ఏమిటి? సైంధవ్ ని చూసి ఓ ముఠా ఎందుకు భయపడుతోంది? ఫ్లాష్ బ్యాక్‌లో అతను చూపించిన సైకో ఇజం ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలే. సెకండాఫ్ లో అయినా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి, వాటికి దర్శకుడు సమాధానాలు చెబుతాడనుకొన్నారంతా. కానీ.. అవేం జరగలేదు. తొలి సగంలో ఉన్న ఎమోషన్, ద్వితీయార్థంలో కనిపించదు. కథ రోడ్లపై తిరుగుతుంటుంది. యాక్షన్ తరవాత యాక్షన్ వచ్చిపోతుంది తప్ప, అందులో ఇంటెన్సిటీ ఉండదు. విక్రమ్‌లా దీన్ని ఓ థ్రిల్లర్‌లా నడపొచ్చు. కానీ.. హై ఇచ్చే మూమెంట్స్ ఉండాలి. అలాంటి సన్నివేశాలు కొన్ని డిజైన్ చేసుకొన్నా - పెద్దగా కిక్ ఇవ్వలేదు. తరవాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠత, ఆసక్తి రేకెత్తించలేకపోయాడు. క్లైమాక్స్ లో కాస్త ఎమోషన్ ఉంది. కానీ అప్పటికే ఈ సినిమాపై సగటు ప్రేక్షకుడు ఏం అంచనాకు వచ్చేస్తాడు. పార్ట్ 2 కోసం కొన్ని ఎలిమెంట్స్ దర్శకుడు దాచుకొన్నాడు. అది మంచిదే కానీ, ఆ ఆలోచనతో `పార్ట్ 1`కి అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది.
నటీనటులు: వెంకీ 75వ సినిమా అనగానే చాలానే అంచనాలు పెట్టుకొంటాం. కానీ ఆ అంచనాల్ని ఈ పాత్ర, కథ ఏమాత్రం అందుకోలేదు. యాక్షన్ కథలు వెంకీకి కొత్త కాదు. కానీ ఈ స్థాయిలో ఆయన యాక్షన్ ఇది వరకు చేయలేదు. సెంటిమెంట్ సీన్లలో బలం లేకపోవడం వల్ల, అందులోనూ వెంకీ నటన తేలిపోయినట్టు అనిపించింది. బేబీ సారా నటన బాగుంది. శ్రద్దా శ్రీనాధ్, ఆండ్రియా, ఆర్య పాత్రల్ని దర్శకుడు సరిగా తీర్చిదిద్దలేదు. ఇక ఈ సినిమాతో తొలిసారి తెలుగులో అడుగుపెట్టిన నవాజుద్దీన్ నటన కూడా అంతంత మాత్రంగానే ఉంది. తనతో ఎక్కువ హిందీ డైలాగులే పలికించారు.
సాంకేతిక వర్గం: యాక్షన్‌కి పెద్ద పీట వేశారు. పోరాట ఘట్టాల్ని బాగా డిజైన్ చేశారు. నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువైంది. విజువల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీలైనంత తక్కువ బడ్జెట్ లో ఈసినిమా తీయాలని ఫిక్సయ్యారేమో..? హిట్, హిట్ 2తో మెప్పించిన శైలేష్ కొలను వెంకీ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడేమో అనిపించింది. తన గత చిత్రాల్లో స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుంది. ఈ వేగం ఈ సినిమాలో కనిపించలేదు. అగ్ర కథానాయకుల్ని హ్యాండిల్ చేసేటప్పుడు యువతరం దర్శకులు కొన్ని తప్పులు చేస్తున్నారు. శైలేష్ కూడా అదే చేశాడు.
ప్లస్ పాయింట్స్
వెంకీ
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
కథనం
ఎమోషన్ పండకపోవడం
ఫైనల్ వర్డిక్ట్: ఇంజక్షన్ కా 'సైడ్ ఎఫెక్ట్స్'..