అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఇటీవల విడుదలైన టీజర్‌తోనే అల్లు అర్జున్ సగం మార్కులు కొట్టేశాడు. పూర్తిగా దేశభక్తి మిళితమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. దేశం కోసం ప్రేమని త్యాగం చేసే యువకుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని పాటను రేపు విడుదల చేయనుంది చిత్ర యూనిట్.
పాటలోని లిరిక్స్‌ని రోజుకో స్టిల్‌తో జోడించి విడుదల చేస్తున్న విధానం పాటపై ఆశక్తిని రేకెత్తిస్తోంది. మొన్న విడుదల చేసిన పోస్టర్‌లో 'నా ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, తల్లే ఇండియా' అని రూపొందించారు. తాజా పోస్టర్‌పై 'పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా..పుస్తెలు లెక్కపెట్టవే సైనికా..' అంటే విడుదల చేశారు. సైనికుడంటే నిద్రాహారాలుండవు. భార్యా పిల్లల గురించి అస్సలు లెక్క చేయడు. ఆ విషయాల్నే ఈ పోస్టర్స్‌పై మెన్షన్ చేస్తున్నారు.
జస్ట్ పోస్టర్ కోసం విడుదల చేసిన లిరిక్స్‌లోనే ఇంతర్ధం దాగుంటే, ఇక పూర్తి పాటలో ఇంకెంత అర్ధం ఉంటుందో. ఈ పాట యూత్‌ని నిజంగా ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుందంటున్నారు. దేశం కోసం తమ ప్రాణాలొడ్డి కాపు కాస్తున్న సైనికులందరికీ ఈ సినిమా అంకితం. అందుకే 'చావాల్సి వస్తే బోర్డర్‌కెళ్లి చచ్చిపోతా..' అని హీరో పాత్ర చేత డైలాగ్ చెప్పించాడంటేనే డైరెక్టర్ ఈ సినిమాని ఎంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడో అర్ధం చేసుకోవచ్చు.
దేశభక్తిని అణువణువునా నింపుకున్న వారికే ఇలాంటి సంభాషణలు రాయడం సాధ్యమవుతుంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. సైనికుడి గెటప్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో సరికొత్తగా కనిపిస్తున్నాడు బన్నీ ఈ సినిమాలో. అనూ ఇమ్మాన్యుయేల్ బన్నీకి జోడీ నటిస్తోంది.