రెడీ, పోకిరి, కిక్, స్టాలిన్... ఇలా చాలా తెలుగు సినిమాల్ని బాలీవుడ్ లో రీమేకులు చేశాడు సల్మాన్ ఖాన్. సౌత్ ఇండియా ఫ్లేవర్ అంటే.. సల్లూభాయ్ కి చాలా ఇష్టం. ఈమధ్య విడుదలైన `రాధే` కూడా సౌత్ ఇండియన్ ఫ్లేవర్ లో సాగే సినిమానే. ఇప్పుడు ఓ తెలుగు సినిమానీ, ఓ తమిళ సినిమానీ రీమేక్ చేయాలని సల్మాన్ ఖాన్ గట్టిగా డిసైడ్ అయ్యాడని, ఆ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడని టాక్ వినిపిస్తోంది.
తమిళంలో విడుదలై సూపర్ హిట్టయిన సినిమా `మాస్టర్`. విజయ్ కథానాయకుడిగా నటించాడు. తెలుగులోనూ ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నాడు. రీమేక్ కి సంబంధించిన ఒప్పందాలు కూడా మొదలైపోయాయని తెలుస్తోంది. అంతే కాదు.... తెలుగులో త్వరలో రాబోతున్న `ఖిలాడీ` సినిమా గురించి కూడా సల్మాన్ ఖాన్ వాకబు చేస్తున్నాడని తెలుస్తోంది. రవితేజ సినిమాల్నీ మంచి మాస్ మసాలాతో సాగుతాయి. ఇలాంటి కథలు.. సల్మాన్ బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపోతాయి. అందుకే.... ఈ సినిమాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాడట. రవితేజ `క్రాక్`పై కూడా సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపించాడని చెప్పుకున్నారు. సల్మాన్ జోరు చూస్తుంటే, కొత్త కథలు రాసుకోవడం కంటే, రీమేకుల్ని నమ్ముకోవడమే బాగుందనుకుంటున్నాడనిపిస్తుంది.