2017లో వచ్చిన సినిమాలన్నింట్లోకీ వసూళ్ల పరంగానైనా, రికార్డుల పరంగానైనా 'బాహుబలి' సినిమానే టాప్. అది ఇటు టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా కానీ. ఈ సినిమా రికార్డుల్నీ, వసూళ్లనీ ఇంతవరకూ ఏ సినిమా కొల్లగొట్టలేదు. అందుకే 'బాహుబలి'.. అదో క్లాసిక్ హిట్‌గా పరిగణించవచ్చు. ఇంకే సినిమా అయినా బాహబలితో పోల్చితే, రెండో స్థానానికే పరిమితమవుతుంది. బాలీవుడ్ విషయానికి వచ్చినా, అక్కడున్నది సల్మాన్ అయినా, అమీర్ ఖాన్ అయినా ఇంకెవరైనా సరే 'బాహుబలి'ని మించి పోటీ పడలేకపోయారనే చెప్పాలి ఈ ఏడాదిలో.
'బాహుబలి' తర్వాత వచ్చిన చిత్రంగా తొలి ప్రయత్నంలోనే సల్మాన్‌ఖాన్ నటించిన 'ట్యూబ్‌లైట్' భారీ అంచనాలు నమోదు చేసింది. కానీ భారీగానే నిరాశ పరిచింది. 'బాహుబలి'నే కొట్టేద్దామనుకున్నాడు ఈ సినిమాతో సల్మాన్. నాన్ బాహుబలి రికార్డుల్ని కూడా కొల్లగొట్టలేకపోయాడు 'ట్యూబ్‌లైట్'తో. అయితే ఆ సినిమాకి టైం కలిసి రాలేదు. కానీ ఇప్పుడు 'టైగర్ జిందా హై' వచ్చింది. ఈ సినిమాతో సల్మాన్ అనుకున్నది సాధించాడు. 'బాహుబలి'ని కాదు.. నాన్ బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టేశాడు. వారం రోజుల్లోనే 200 కోట్లు దాటేశాడు సల్మాన్ 'టైగర్ జిందా హై'తో. ఇంకా ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఇదే జోరుతో మరికొద్ది రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లోకి టైగర్ చేరిపోనుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అటు ఓవర్సీస్‌లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ కూడా 'టైగర్' దూకుడుకి ఆకాశమే హద్దయ్యింది. చూడాలి ఈ దూకుడు ఇంకెంత దూరం వెళ్త్తుందో! సల్మాన్‌తో చాలా కాలం తర్వాత ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ జత కట్టిన సినిమా 'టైగర్ జిందా హై'.