టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత చాలా వుంది. పైగా కరోనా టైమ్ కదా..? చాలా మంది కెమెరా ముందుకు రావడానికే ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో.... పాత హీరోయిల్ని వెదికి పట్టుకుని, వాళ్లకు మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు దర్శకులు. ఇప్పుడు సలోనీ కూడా అలానే ఎంట్రీ ఇస్తోంది. మర్యాద రామన్న లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది సలోని. అయితే ఆమె హవా ఎంతో కాలం సాగలేదు. చూడ్డానికి రొమాంటిక్ గా ఉన్నా, అభినయ కౌశలం లేకపోవడంతోనూ, వరుస ఫ్లాపులతోనూ ట్రాక్ తప్పేసింది.
చాలా కాలం నుంచీ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు ఓ ఛాన్స్ దక్కింది. సునీల్ కథానాయకుడిగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సలోనిని కథానాయికగా ఎంచుకున్నారు. `మర్యాద రామన్న`లో సునీల్ - సలోని జంటగా నటించిన సంగతి తెలిసిందే. `రావె.. రావె.. రావె. రావె.. రావె సలోని` అంటూ ఈ సినిమాలో ఇద్దరూ ఆడి పాడారు. ఇంతకాలానికి మళ్లీ ఈ జంట కనిపించబోతోందన్నమాట. మరి మర్యాద రామన్న సెంటిమెంట్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.