సినిమా చేశామా? పారితోషికం తీసుకొన్నామా? అన్నట్టుంటుంది కొంతమంది కథానాయికల వ్యవహారం. ప్రమోషన్లకు ఏమాత్రం రారు. నయనతారనే తీసుకోండి. తాను ప్రమోషన్ కి రానని ముందే ఖరాఖండీగా చెప్పేస్తోంది. అందుకు ఒప్పుకొంటేనే.. సినిమాపై సంతకం చేస్తుంది. ఇంకొంతమంది ప్రమోషన్లకు రావడానికి బెట్టు చేస్తారు. ఏదో ఓ కారణంతో డుమ్మా కొడతారు. అయితే వీళ్లందరి మధ్య సమంత ప్రత్యేకం. సమంత ఇప్పుడు అనారోగ్యం పాలైంది. బయటకు వచ్చేంత శక్తి, ఓపిక సమంతకు లేదు. మంచంపై కూర్చునే.. `యశోద` కు డబ్బింగ్ చెప్పింది. ఇలాంటి సమయంలో సమంత డబ్బింగ్ చెప్పకపోయినా, ప్రమోషన్లకు రాకపోయినా.. ఆమెకు ఎవరూ ఏమీ అనలేరు. పైగా ఆమె బాధని అర్థం చేసుకోగలరు. కానీ సమంత.. మాత్రం `యశోద` ప్రమోషన్లకు వస్తోంది. ఇంత బాధలోనూ.. ధైర్యంగా నిర్మాత వెనుక నిలబడుతోంది.
తాను యశోద ప్రమోషన్లలో పాల్గొంటానని సమంత ట్వీట్ చేసింది. సినిమాపై తనకున్న ప్రేమకు ఇంతకు మించిన నిదర్శనం ఏమి కావాలి? సమంత టైటిల్ రోల్ పోషించిన చిత్రం యశోద. ఈనెల 11న విడుదల అవుతోంది. ఈ సినిమా సమంతనే ప్రధాన ఆకర్షణ. అలాంటిది సమంత లేకుండా యశోద ప్రమోషన్ ఘట్టం ముగుస్తుందనుకొన్నారంతా. అయితే సమంత అనూహ్యమైన నిర్ణయం తీసుకొంది. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రమోషన్లకు వస్తానంటోంది. దాన్ని బట్టి సమంత డెడికేషన్ ఏపాటిదో అర్థమవుతోంది. ఈ విషయంలో మిగిలిన హీరోయిన్లందరికీ సమంత ఆదర్శంగా నిలుస్తోంది. హ్యాట్సాఫ్ సమంత..!