అనుకొన్నట్టే ఆదిపురుష్ వాయిదా పడింది. ఈసినిమా సంక్రాంతికి రావడం లేదు. 2023 జూన్ 16 న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకం. అవి సరిగా రాలేదని. దానిపై మళ్లీ కసరత్తు చేయాల్సివస్తోందని, అందుకే సినిమా ఆలస్యం అవుతుందని టాక్ వినిపించింది. దానికి తగ్గట్టే.. ఇప్పుడు రిలీజ్ డేట్ మళ్లీ మార్చారు.జూన్ అంటే ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసమే అయితే ఇంత సమయం అవసరం లేదు. వీఎఫ్ఎక్స్ తో పాటు.. కొన్ని సీన్లు రీషూట్ చేయాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ సినిమాని ఆలస్యంగా విడుదల చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఆదిపురుష్ వాయిదా పడడంతో.. ఆ ఎఫెక్ట్ సలార్‌పై కూడా పడబోతోంది. 2023 వేసవిలో సలార్ విడుదల కావాల్సివుంది. అదే సమయంలో ఆదిపురుష్ కూడా వస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య నాలుగు నెలలైనా గ్యాప్ ఉండాలని ప్రభాస్ భావిస్తున్నాడు. జూన్ లో... ఆదిపురుష్ వస్తే, సలార్ వాయిదా పడడం ఖాయం. అంటే.. సలార్ కోసం మరో నాలుగు నెలలు ఎదురు చూడాలి.