ఇప్పటి టాప్ స్టార్స్ అంతా వెబ్ సిరీస్ ల వైపు దృష్టి పెట్టారు. పాన్ ఇండియా ఇమేజ్, బోలెడంత పారితోషికం.. దానికి తోడు సరికొత్త ఆదాయ మార్గం. అందుకే వెబ్ సిరీస్‌లంటే మోజు చూపిస్తున్నారు. తాజాగా.. సమంత కూడా ఓ వెబ్ సిరీస్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అదే `ఫ్యామిలీ మేన్ 2`. తొలి భాగం సూపర్ డూపర్ హిట్టవ్వడంతో సీజన్ 2 పై అంచనాలు పెరిగాయి. అందుకే సమంత లాంటి స్టార్ ని తీసుకొచ్చారు. ఇందులో సమంత ఓ టెర్రరిస్ట్ గా నటిస్తోంది. ఈనెల 12న ఈ వెబ్ సిరీస్ విడుదల కావాల్సివుంది.
అయితే ఇప్పుడు వాయిదా పడింది. ఈ వెబ్ సిరీస్ ని వేసవిలో విడుదల చేయనున్నట్టు దర్శకులు రాజ్ - డీకే ప్రకటించారు. అయితే డేట్ ఇంకా ఖరారు చేయలేదు. వేసవికి ఈ సిరీస్ వాయిదా పడడానికి ఓ కారణం... వుంది. ఇటీవల తాండవ్ లాంటి కొన్ని వెబ్ సిరీస్‌లు వివాదాల పాలయ్యాయి. మతానికి సంబంధించిన సున్నితమైన విషయాల్ని డీల్ చేసినప్పుడు ఇలాంటి వివాదాలు సహజం. `ఫ్యామిలీ మేన్`లోనూ అలాంటి అంశాలున్నాయి. అందుకే... ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని, రీషూట్లు చేసుకుని.. అప్పుడు విడుదల చేయాలనే.. ఇప్పుడు వాయిదా వేశార్ట. మొత్తానికి సమంత.. తొలి వెబ్ సిరీస్ చూడాలనుకున్నవాళ్లంతా.. ఇంకొన్నాళ్లు ఎదురు చూడాలి.