గత వారం పది రోజులుగా సోషల్ మీడియా అంతా సమంత చుట్టూనే తిరిగింది. ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. నాగచైతన్యతో విడాకుల విషయంలో - సమంతపై సానుభూతి చూపిస్తున్నవాళ్లు కొందరైతే, ఇదంతా సమంత వల్లే అంటూ నిందలు వేస్తున్న వాళ్లు ఇంకొందరు. ఆ తరవాత సమంత పరిస్థితేంటి? సినిమాలు చేస్తుందా? లేదా? హైదరాబాద్ లో ఉంటుందా, మకాం మార్చేస్తుందా? అంటూ రకరకాల ఊహాగానాలు.
అయితే వీటికి చెక్‌పెట్టడానికి సమంత నిర్ణయించుకుంది. ఇక మీదట సినిమాలపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. పైగా.. ముంబై కో, చెన్నైకో షిఫ్ట్ అయిపోవాలని చూడడం లేదు. హైదరాబాద్ లోనే ఉంటూ సినిమాలు చేయాలని ఫిక్సయ్యిందట. అందుకే ఫటాఫట్ మంటూ కొత్త ప్రాజెక్టుల్ని ఒప్పుకోబోతోందట. సమంత కొత్తగా మూడు సినిమాలకు సంతకాలు చేసిందని, ఇవన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలే అని తెలుస్తోంది. ఆయా సినిమాలకు సంబంధించిన అధికారిక వార్తల్ని దర్శక నిర్మాతల నుంచి రివీల్ చేయించాలని చూస్తోంది.
సమంతకు ముందు నుంచీ ప్రొడక్షన్ పై దృష్టి ఉంది. నాగచైతన్యతో కలిసి సినిమాల్ని నిర్మించాలని అనుకుంది. ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు సోలోగా ఆ పని మొదలెట్టాలని చూస్తోంది. త్వరలోనే సమంత నిర్మాతగానూ మారాలనుకుంటుందన్నది టాలీవుడ్ టాక్. అలా.... కాస్త మనసుని డైవర్ట్ చేయాలని చూస్తోందట. త్వరలోనే సమంత కొత్త సినిమాలకు సంబంధించిన కబుర్లు వినిపిస్తాయి.