నాగచైతన్య - సమంత... ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లోనే క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరి కెరీర్లూ ఇప్పుడు మంచి ఊపు మీదున్నాయి. అయితే ఇప్పుడు ఈ జంటకు సంబంధిచి ఓ షాకింగ్ వార్త... టాలీవుడ్ అంతా చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, త్వరలోనే విడిపోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి.
చైతూతో పెళ్లయ్యాక... సమంత ట్విట్టర్ లో తన ఇంటి పేరు అక్కినేనిగా మార్చుకుంది. ఇప్పుడు అక్కినేని పేరు తొలగించడమే... ఈ పుకార్లకు కారణం. సమంత అక్కినేని పేరు ఎందుకు తొలగించుకుంది? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై సమంతని అడిగినా తను నేరుగా స్పందించడం లేదు. `సమయం వచ్చినప్పుడు చెబుతా` అంటోంది. నిజానికి ఇలాంటి విషయాలపై చిలవలు పలవలూ రాయకుండా.. సెలబ్రెటీలు జాగ్రత్త పడతారు. పుకార్లు మొదలవ్వగానే క్లారిటీ ఇస్తారు.కానీ సమంత అలాంటివేం చేయడం లేదు. తన ఇంటి పేరు ముందు నుంచి అక్కినేని తొలగించడం అంటే.. ఆ కుటుంబానికి పూర్తిగా దూరమైనట్టే అని కొంతమంది వాదన. అయితే సమంత ఇండిపెండింట్ వుమెన్. తన సొంత కాళ్లపై ఎదిగింది. అలాంటప్పుడు ఇంటిపేరుతో అవసరం ఏమిటన్నది ఇంకొందరి వాదన.
కాకపోతే.. ఇద్దరి మధ్యా విబేధాలు నడుస్తున్నాయని, ఇరు కుటుంబాల వాళ్లూ... నచ్చజెప్పాలనిచూసినా వీలు కాలేదని, అందుకే విడాకుల వరకూ వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై సమంతనో, చైతూనో క్లారిటీ ఇవ్వాల్సిందే. అప్పటి వరకూ ఈ పుకార్లు ఆగవు.