సమంత.. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న కథానాయిక. ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. కథల్ని తన చుట్టూ తిప్పుకుంటోంది. తన కెరీర్‌లో దాదాపు 50 సినిమాలు పూర్తి చేసింది. అయితే.. ఇప్పుడే ది బెస్ట్ అనదగ్గ పాత్ర పడిందట. అదే.. `శాకుంతలమ్`. తనకి ఇది డ్రీమ్ ప్రాజెక్టులాంటిదంటోంది సమంత. తన సినీ ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచీ ఈ తరహా అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, గుణశేఖర్ తనకు ఈ సినిమాని బహుమతిగా ఇచ్చారని సంతోషపడిపోతోంది.
ఈ సినిమాకి గుణశేఖర్, దిల్ రాజు నిర్మాతలు. వాళ్లిద్దరూ శకుంతలమ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. సమంతపై ఇంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా? అనేదే ప్రధాన ప్రశ్న. ఈ సినిమాకి ప్రధాన సేలబుల్ పాయింట్.. సమంతనే. కానీ సమంత మాత్రం `ఇది నా రేంజ్ బడ్జెట్ సినిమా కాదని` నిజాయతీగా చెప్పేస్తోంది. తన మార్కెట్ రేంజ్ ని మించి ఈసినిమా కోసం ఖర్చు పెడుతున్నారని, అందుకే.. తాను మరింతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని నటిస్తున్నానని అంటోంది. 2022లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.